- టీడీపీ జాతీయ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు
- వినతులతో తరలివచ్చిన అర్జీదారులు
- స్వీకరించిన మంత్రి పార్థసారథి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి
- సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు
అమరావతి(చైతన్యరథం): టీడీపీ జాతీయ కార్యాలయానికి పోటెత్తుతున్న అర్జీలను చూస్తుంటే గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందనే విషయం స్పష్టమవుతోంది. భూ సమస్యలు, పింఛన్లు, గుంతల రోడ్లు, నిరుద్యోగం, అక్రమ కేసులు, బిల్లులు రాని వారు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆడబిడ్డలపై హత్యాచారాలు, హత్యలు.. ఇలా నిత్యం వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిత్యం టీడీపీ జాతీయ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్న మంత్రులు, నేతలు.. ప్రజల వినతులను ఓపిగ్గా వింటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అర్జీలు స్వీకరించారు.
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడిరోడ్డుపై చంపి కాలువలో పడేస్తామని తనను బెదిరించారని, తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భయం వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం వేలగలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీని అందించి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
చిత్తూరు జిల్లా వేనుగోపాలపురం మండలం పెనమలూరు గ్రామం వడ్డెర కమ్యూనిటీకి చెందిన ఇంటర్ చదివే అమ్మాయి భవ్యశ్రీని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి బంధువులు బంధించి అత్యాచారం చేసి గత ఏడాది సెప్టెంబర్ 29న అతి దారుణంగా చంపేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తప్పుదారి పట్టించారని, నేరస్థులను శిక్షించాలని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపు మునుస్వామి వినతి పత్రం అందించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామానికి చెందిన పోతల రాజప్పన్న విజ్ఞప్తి చేస్తూ.. రణస్థలం నుండి రామతీర్థం వరకు ఉన్న కేఆర్ రోడ్డు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం నిర్మించారని, నేడు ఆరోడ్డు గుంతలతో అధ్వానంగా ఉందని, ఆ రోడ్డులో వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన పార్వతి అనే మహిళ పొట్టకూటికోసం 2013 లో దుబాయి వెళ్లిందని, ఆమె ఏమైందో జాడ తెలియలేదని, ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించాలని ఆమె బందువు కోటేసు విజ్ఞప్తి చేశాడు.
తన భర్త జీవనోపాధికి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ప్రమాదవశాస్తు మరణించాడని, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, తనకు జీవనోపాధి లేదని, కుమారుల విద్యాభివృద్ధికి సాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాని అనంత లక్ష్మి విన్నవించారు. మాచర్ల నియోజకవర్గం కంభంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తన సమస్య విన్నవిస్తూ.. తన భర్త మరో పెళ్లి చేసుకునేందుకు తనను విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. దానిపై కేసు కోర్టులో ఉందని, అయినప్పటికీ అధికారులకు, నాయకులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.