- ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌కు బాధితుడి గోడు
- మూడెకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేశారని మరొకరి ఫిర్యాదు
- సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు
- 22వ రోజు ఉండవల్లిలో నివాసానికి బారులు తీరిన అర్జీదారులు
అమరావతి(చైతన్యరథం): ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. లోకేష్‌ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. 22వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని వినతులపై అప్పటి కప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రోడ్డు వెడల్పు పేరుతో ఇంటిని కూల్చేశారు
మంగళగిరి 17వ వార్డుకు చెందిన ఓసూరి వెంకయ్య తన సమస్యను వివరిస్తూ గౌతమ బుద్ధా రోడ్డులో నివాసముండే తన ఇంటిని గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెడల్పు పేరుతో సగ భాగం కూల్చి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ ట్రాన్స్‌ఫారమ్ కూడా ఏర్పాటు చేశారని తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి దళితవాడకు చెందిన జె.ప్రియాంక భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్నానని, తన ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం సీఆర్డీఏ రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తనకు ఎలాంటి ఆధారం లేదని, అంగన్‌వాడీ ఉద్యోగం చేసే తన సతీమణి గతేడాది మరణించిందని ఉండవల్లికి చెందిన శిఖా శేఖర్‌బాబు మంత్రి నారా లోకేష్‌ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఇద్దరు కుమార్తెలకు ఉద్యోగం కల్పించడంతో పాటు టిడ్కో ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలని విన్నవించారు.
గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు
మంగళగిరికి చెందిన ఆర్.అశోక్‌బాబు అనే కాంట్రాక్టర్ మంత్రి నారా లోకేష్‌ను కలిసి తన సమస్యను వివరించారు. తాడేపల్లి, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పూర్తిచేసిన సివిల్ పనులకు గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. బిల్లులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందు లతో సతమతమవుతున్న తాను అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, స్థలం మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం చినకాకానికి చెందిన కె.ధనరాజ్ విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులో తన ఇద్దరి పిల్లల పేర్లు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని మంగళగిరికి చెందిన కె.పూర్ణశేఖర్ మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోలేదన్నారు. పరిశీ లించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మూడెకరాల భూమికి తక్కువ పరిహారం ఇచ్చారు
ఏలూరు జిల్లా పొంగుటూరు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీను మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి కోసం సేకరించిన తమ మూడెకరాల భూమికి తక్కువ పరిహారం అందించారని, మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఎంఏ చదివిన తనకు ఉద్యోగావకాశం కల్పిం చి ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా బోయలకింతాడ గ్రామానికి చెందిన డి.వి.ఎల్.ఎన్. మూర్తి విజ్ఞప్తి చేశారు.
మూడెకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు
పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన తమ మూడెకరాల అసైన్డ్ భూమిని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేశారని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన గుం టి రాము లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో తమ భూమిని ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రశ్నించిన తమపై దాడి చేసి భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణరక్షణ కల్పించడం తో పాటు భూమిని అన్యాక్రాంతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతి
రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లకు హెచ్ ఆర్ పాలసీ అమలుచేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది వినతిపత్రం అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏటపాకకు గ్రామంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న ఎయిడెడ్ స్కూల్‌ను జడ్పీఎస్‌ఎస్ స్కూల్‌గా మార్చాలని, గ్రామంలో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ మంజూరు చేయాలని, గ్రామం గోదావరి వరద ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మించాలని గ్రామస్తులు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, అర్హత ఉన్న తమకు వృద్ధాప్య, దివ్యాంగ పెన్షన్ అందించి ఆదుకోవాలని, కాలేజీల్లో సీటు కల్పించాలని, ఉపకార వేతనాలు అందించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.