విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అమరావతి తరపున ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన అంగీకార లేఖను గురువారం విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జేఏసీ ప్రతినిధులు అందించారు. అనంతర ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి విజయవాడలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ముంపులో లక్షలాది మంది జలదిగ్భందంలో చిక్కుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. 74 ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ వరదల్లో ఉద్యోగులు కూడా చాలా మంది చిక్కుకున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్దన సహాయ చర్యలు చేపట్టిందని బొప్పరాజు అన్నారు. ఏపీలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఉద్యోగులు అండగానే ఉంటున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వరద బాధితుల సహాయం కోసం తమ ఉద్యోగుల తరఫున ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామని చెప్పారు. ఇందులో అధికారికంగా అన్ని ప్రభుత్వ శాఖలు, సంఘాలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి మా సమ్మతి లేఖను అందజేశామని చెప్పారు. అలాగే వరదల్లో చిక్కుకున్న చిరుద్యోగులకు కూడా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నామని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఉద్యోగులు కూడా చేతనైన సాయం చేయాలని బొప్పరాజు పిలుపు ఇచ్చారు.