- వరదలతో నష్టపోయిన పంచాయతీలకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం
- రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ
- పవన్ కళ్యాణ్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది: నాదెండ్ల మనోహర్
- పవన్ స్ఫూర్తితో పంచాయతీలను అభివృద్ధి చేసుకుందాం: కూటమి నేతలు
అమరావతి(చైతన్యరథం): మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సాకారం చేసుకుందామని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బటన్లు నొక్కాం… బటన్లు నొక్కాం అంటూనే రాత్రికి రాత్రే 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం నిధులను పక్కదారి పట్టించారని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో కనీసం వీధి దీపాలు వేయించుకునే పరిస్థితి కూడా గ్రామాల్లో లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు భారీ విరాళం ప్రకటించి, ఆ మొత్తాలను నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత పవన్ కళ్యాణ్‌కి దక్కుతుందన్నారు.
భారీ వర్షాలు, వరదలు కారణంగా ముంపునకు గురైన 400 గ్రామ పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి ప్రకటించిన విరాళం మొత్తం రూ.4 కోట్లలో పంచాయతీకి రూ. లక్ష చొప్పున పంపిణీ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది.
మొత్తం 19 కేంద్రాల్లో నాలుగు వందల చెక్కులను ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి పక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. తెనాలిలో ఈ చెక్కులను మనోహర్ చేతుల మీదుగా 25 పంచాయతీలకు అందజేశారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…కొంతమంది నాయకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాక్షేమం గురించే ఆలోచిస్తారు. 400 వరద ప్రభావిత పంచాయతీలకు లక్ష చొప్పున రూ. 4 కోట్లు అందించి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. పంచాయతీలకు అందించిన ఈ సొమ్ముతో వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు, శానిటేషన్ పనులకు ఉపయోగించుకోవాలి. ప్రతి పంచాయతీని రోల్ మోడల్‌గా మార్చాలని పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారని మనోహర్ తెలిపారు.
పంచాయతీలను అభివృద్ధి చేయాలి : మండలి బుద్దప్రసాద్
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీల అభివృద్ధి నిధులు సైతం స్వాహా చేస్తే, పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పంచాయతీలకు రూ.4 కోట్ల సొంత నిధులు సమకూర్చారని తెలిపారు. గ్రామీణ ప్రగతికి సొంత నిధులు సమకూర్చిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేతను ఆదర్శంగా తీసుకుని ప్రతి సర్పంచ్ తమ పంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. సోమవారం అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో వరద ముంపుకు గురైన 9 పంచాయతీలకు పవన్ కళ్యాణ్ పంపిన రూ.9 లక్షల మొత్తాన్ని ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్పులకు అందజేశారు. ఇందులో అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఐదు, పామర్రు నియోజకవర్గానికి చెందిన నాలుగు పంచాయతీలు ఉన్నాయి.
చరిత్రలో నిలిచిపోయే నాయకుడు పవన్ : ఎంపీ బాలశౌరి
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదల రూపంలో ముంచుకొచ్చిన విపత్తు నుండి పంచాయతీలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి రూ. 4 కోట్లు ప్రకటించారని, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో సర్పంచులు పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల పరిధిలో వర్షాలు, వరద కారణంగా ముంపుకు గురైన 22 గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. కంకిపాడు రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజాతో కలసి పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులకు చెక్కులు అందజేశారు.
విజయవాడ రూరల్ గన్నవరం, మైలవరం నియోజకవర్గాల పరిధిలో వరద ముంపుకు గురైన 17 పంచాయతీలకు ప్రసాదంపాడులోని హోటల్ మధువన్ గ్రాండ్ లో పవన్ కళ్యాణ్ పంపిన చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్, గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని చెక్కులు అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచిలి మండల కేంద్రంలో జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గవర ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాస్) ఆధ్వర్యంలో పంచాయతీలకు రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీతమ్మినీడి ఉమానరసింహ కళ్యాణ మండపంలో ముంపునకు గురైన 11 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 11 లక్షలు నరసాపురం శాసన సభ్యుడు బొమ్మిడి నాయకర్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, తదితరుల చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు.
మైలవరం, తిరువూరుల్లో రూ.46 లక్షల చెక్కులు
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ తర్వాత తీవ్ర నష్టం సంభవించిన నియోజకవర్గాలు మైలవరం, తిరువూరు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో 46 గ్రామాలు వరద ప్రభావానికి లోనైనట్టు పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది. ఈ మొత్తం పంచాయతీలకు ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ పంపిన రూ.46 లక్షల చెక్కులను ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు. సోమవారం జి.కొండూరు మండల కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ముఖ్యఅతిధిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు.
పోలవరం నియోజకవర్గ పరిధిలో 31 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున రూ.31 లక్షల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు. కొయ్యలగూడెం మండలం, శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 31 పంచాయతీలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వేసిన ఓటు వృథా కానివ్వమని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసే ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో 21 గ్రామ పంచాయతీ లు అధిక వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ముంపుకు గురయ్యాయి. ఈ 21 పంచాయతీలకు పంచాయతీకి రూ. లక్ష చొప్పున సోమవారం సాయంత్రం కూటమి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ చేతుల మీదుగా ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు చెక్కులు అందజేశారు.
పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని 40 గ్రామ పంచాయతీలకు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా రూ. లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లాలోనూ రెండు గ్రామ పంచాయితీలు వరద ముంపుకు అతలాకుతలం అయ్యాయి. నందికొట్కూరు. నియోజకవర్గం పరిధిలోని ఆ రెండు పంచాయతీలకు రూ. లక్ష చెక్కులు స్థానిక శాసన సభ్యుడు గిత్త జయసూర్య చేతుల మీదుగా అందజేశారు.
నూజివీడు నియోజకవర్గం పరిధిలో ముంపుకు గురైన 23 గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారథి చేతుల మీదుగా సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు చెక్కులు అందజేశారు.
కైకలూరు పరిధిలో మొత్తం ఆరు గ్రామాలు ముంపుకు గురికాగా సోమవారం స్థానిక శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
మంగళగిరి, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో ముంపుకు గురైన 21 గ్రామ పంచాయతీలకు రూ. లక్ష చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళగిరిలోని సీఎన్‌ఆర్ బాంక్వెట్ హాల్ లో జరిగింది. కూటమికి చెందిన తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర చేతుల మీదుగా ఈ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్సులు వడ్రాణం మార్కండేయబాబు, బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కువ గ్రామాలు నష్టపోయిన నియోజకవర్గాల్లో నందిగామ ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 38 గ్రామాలు తీవ్రంగా నష్టపోగా సోమవారం పంచాయతీకి రూ. లక్ష చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా సర్పంచులకు ఈ చెక్కులు అందజేశారు.
దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల పరిదిలో 20 గ్రామ పంచాయతీలు వరద ముంపుకు గురయ్యాయి. సోమవారం 20 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏలూరులో నిర్వహించారు. ఉంగుటూరు శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేతుల మీదుగా ఈ చెక్కులు పంచాయతీలకు అందజేశారు.
కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో తునిలో ఏడు గ్రామ పంచాయతీలకు రూ. లక్ష చెక్కులు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత రాజా అశోక్ బాబుల చేతుల మీదుగా ఈ చెక్కులు పంపిణీ జరిగింది.
చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన, పోలవరం శాసనసభ్యుడు చిర్రి బాలరాజు, పార్టీ నాయకులు కరాటం రాంబాబు, కరాటం సాయి చేతుల మీదుగా ముంపుకు గురైన పది పంచాయతీలకు రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో 20 గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చెక్కులు ఆయా గ్రామాల సర్పంచులకు ఇచ్చారు. స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో ముంపుకు గురైన 15గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జ్ సయ్యద్ జిలానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నేతలు రాయల నాగ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.