- డ్రోన్ హ్యాక్‌థాన్‌కు 400 మంది నమోదు
- ఔత్సాహికుల కోసం రెండు రోజుల గడువు పెంపు
- విజేతలకు నగదు బహుమతి రూ.24 లక్షల వరకు పెంపు
- డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. జాతీయ సదస్సులో భాగంగా ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాక్‌థాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు ఏకంగా 400మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారు. మరింతమంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్న దరమిలా పోటీలో నమోదు గడువును మరో రెండు రోజులు పెంచినట్లు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ కె దినేష్‌కుమార్ తెలిపారు. ఈనెల 17లోపు హ్యాక్‌థాన్‌లో పాల్గొనదలచినవాళ్లు పేర్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోచ్చని తెలిపారు. 9 థీమ్స్‌లో జరిగే పోటీల్లో గెలుపొందిన విజేతలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కేటగిరీనుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష నగదు బహుమతులు అందజేస్తారు. 22న డ్రోన్స్ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రధానం చేస్తామని దినేష్ కుమార్ తెలిపారు.
వెయ్యి మంది ప్రతినిధుల హాజరు
రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సుకు వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో సదస్సు జరుగుతుంది. 22న సాయంత్రం కృష్ణా తీరం పున్నమీ ఘాట్‌లో 5వేల డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని డ్రోన్ షో తిలకించాలని దినేష్ కుమార్ కోరారు.