- దృఢమైన నిర్ణయాలతో ప్రపంచనేతగా ఎదిగారు..
- ప్రపంచంలో అగశ్రేణి ఆర్థిఖ వ్యవస్థ దిశగా భారత్
- ఎన్డీయే సీఎంల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంస
- మోదీ విజయాలనే అలవాటు చేసుకున్నారంటూ చమత్కారం
- వికసిత్ భారత్ 2047పై చంద్రబాబు కీలకోపన్యాసం
చండీగఢ్: ‘వికసిత్ భారత్ 2047’ ప్రధాన అజెండాగా ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం హర్యానాలో గురువారం రాత్రి జరిగింది. నిర్దేశిత సమయంలో లక్ష్య సాధనకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో దేశం ఆర్థికంగానే కాదు, అన్ని విధాలుగా బలమైన శక్తిగా మారుతోందని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనే అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలతో భారతదేశం ప్రపంచంలో రెండవ లేదా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోవడం ఖాయమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ కేవలం విజయాలనే అలవాటు చేసుకున్నారని చమత్కరిస్తూనే.. ధృడమైన సాహసోపేతమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యూనికేషన్.. ఇవే ఆయనను విజయమార్గాలలో నడిపిస్తున్నాయని అన్నారు.
ప్రధాని మోదీ తన డైనమిక్ నాయకత్వంతో భారతదేశాన్ని, భారతీయులను ప్రపంచ వేదికపై ముందుకు నడిపిస్తూ ప్రపంచ నాయకుడిగా ఎదిగారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి మోదీ ఏ ఎన్నికల్లోనూ ఓటమి చూడలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే.. ఇది ప్రజల ఆకాంక్షలు, అనుబంధంపై మోదీజీ ముద్ర తెలియజేస్తుందని అన్నారు. ఇక `వికసిత్ భారత్ 2047’ సాధనకు ఆత్మనిర్బర్ భారత్, జీరో పావర్టీ, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం, పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుదుత్పత్తి, నైపుణ్యం, మానవవనరులు, నదుల అనుసంధానం, జనాభా నిర్వహణ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలన్న అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దిశానిర్దేశ ఉపన్యాసం అటు ప్రధాని సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ మంత్రముగ్దులను చేసింది.
ప్రసంగంలో తన ఆలోచనలు, అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ మన్ననలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగానికి సూచనలు, ప్రతిపాదనలు అందిస్తూనే ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రులను అభినందనలు తెలిపారు. ఇక, ప్రధాని తన ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావించిన అనేక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనతోవున్న అభివృద్ధి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగావున్న సమయంలో కాశ్మీర్‌లో జరిగిన ఎన్డీయే సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ‘మా రాష్ట్రాల్లో సంస్కరణలకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు, తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కరణలతో పేదలకు లబ్దిచేకూరుతుందని.. అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని నాటి ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని వాజపేయికి సుస్పష్టంగా చెప్పామని గుర్తు చేసుకున్నారు.
నాయబ్ సింగ్ సైనీకి అభినందనలు
గురువారం ఉదయం చండీగఢ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు విమానాశ్రయంలోనే అపార గౌరవ స్వాగతం లభించింది. హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపధ్యంలో.. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్లగలదని ఆకాంక్షిస్తూనే.. సీఎం బాధ్యతలు స్వీకరించిన నాయబ్ సింగ్ సైనీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పంచకులలో జరిగిన కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జెపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు.
ఏపీలోని ఎన్డీయే సర్కారు అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు రూపొందించుకుని `పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలతో.. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు స్వర్గధామం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం మించిన దొరకదు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే.. మీకు వ్యాపారాభివృద్ధి. రాష్ట్రానికి ఆర్థిక సామర్థ్యం పెంపు. – ముఖ్యమంత్రి చంద్రబాబు