- త్వరలో స్పోర్ట్స్ పాలసీలను ప్రకటిస్తాం
- క్రీడారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టీకరణ
నెల్లూరు (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన క్రీడారంగానికి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీలను ప్రకటిస్తామన్నారు. నెల్లూరు జిల్లాలోని మొగళ్లపాలెంలో మల్టీపర్పస్ ఇండోర్ హాలు, నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. తొలుత మల్టీపర్పస్ ఇండోర్ హాలులో జరిగిన పనులను పరిశీలించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్షించారు. పెండిరగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, మరో 15 రోజుల్లో ఇండోర్ హాలును వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంను పరిశీలించి నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కేవీకేలు, ఇండోర్ స్టేడియంలు, అవుట్‌డోర్ స్టేడియంలు, డీఎస్‌ఏల పనితీరును పరిశీలిస్తున్నామన్నారు. క్రీడారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు.
2017లో కేంద్ర మాజీమంత్రి వెంకయ్యనాయుడు కోరిక మేరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 150 ఎకరాల భూమిని మల్టీపర్పస్ ఇండోర్ హాలుకు కేటాయించిందని, రూ.8 కోట్లతో నిర్మాణాలను చేపట్టి 80శాతం పనులను కూడా పూర్తి చేసిందన్నారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ క్రీడారంగాన్ని నిర్వీర్యం చేసిందని, ఐదేళ్లుగా రాష్ట్రంలోని క్రీడావికాస కేంద్రాల నిర్మాణాలు, స్టేడియాల నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పెండిరగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి మరో 15రోజుల్లో మల్టీపర్పస్ ఇండోర్ హాలును వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. 2027లో నేషనల్ గేమ్స్‌ను మన రాష్ట్రంలోనే నిర్వహించాలనే దృఢసంకల్పంతో చంద్రబాబునాయుడు ఉన్నారని, దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేలా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్ధులు క్రీడల్లో రాణించాలని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ఆకాంక్షిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని 4039 పాఠశాలలను గుర్తించి ఆట స్థలాలు ఏర్పాటు చేసేలా జీవోలను సైతం తీసుకొచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.119 కోట్లు స్వాహా చేసిందని, క్రీడారంగాన్ని రాజకీయక్రీడగా మార్చిందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేకమైన స్పోర్ట్స్ పాలసీలు తీసుకొస్తుందన్నారు. ఇటీవల 53 క్రీడలకు సంబంధించిన అసోసియేషన్లతో సమావేశం నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్వహించిన స్పోర్ట్స్ రివ్యూలో పాల్గొన్నామన్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారుచేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న కేవీకేలు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా క్రీడారంగంలో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఔత్సాహికులు, మాజీ క్రీడాకారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ కూడా క్రీడారంగంలో పీపీపీ విధానాన్ని అమలుచేస్తున్నారని, దాని కారణంగా క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
సమస్యల పరిష్కారానికి శాప్ కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
క్రీడారంగంలోని సమస్యల పరిష్కారానికి శాప్ కృషి చేయాలని, గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పేర్కొన్నారు. శాప్ ఛైర్మన్‌గా రవినాయుడుకి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించడం సంతోషదాయకమన్నారు. నెల్లూరులో ఉన్న సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో సమస్యలను పరిష్కరించి స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మల్టీపర్పస్ ఇండోర్ హాలును కూడా వినియోగంలోకి తీసుకురావాలని శాప్ చైర్మన్‌ను కోరారు.
వైసీపీకీ పబ్లిసిటీ పిచ్చి: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో క్రీడారంగాన్ని పట్టించుకోలేదని, కేవలం ఎలక్షన్ పబ్లిసిటీ కోసం రూ.119కోట్లను ఆడుదాం ఆంధ్రా పేరుతో దుర్వినియోగం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడారంగంపై దృష్టి పెట్టిందన్నారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులను మళ్లీ ప్రారంభించిందని, త్వరలోనే క్రీడాకారులకు వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారులతో సమీక్ష
క్రీడారంగం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారని, ఆయన అంచనాలను అందుకునేలా శాప్ అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని శాప్ ఛైర్మన్ రవినాయుడు సూచించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో శాప్ ఉద్యోగులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు. నెల్లూరు జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా చూడాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ విషయంలో శాప్ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అనంతరం క్రీడా వికాస కేంద్రాలు, స్టేడియంలు, స్పోర్ట్స్ విలేజీలు, స్పోర్ట్స్ పాలసీలు, పీపీపీ విధానం, సీఎస్‌ఆర్ ఫండ్స్‌కు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ ఆర్కే ఎథిరాజ్, నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.