రామచంద్రపురం/కే గంగవరం (చైతన్యరథం): రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం ఆయన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కే గంగవరం మండలాలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ నిధులతో గ్రామాలలో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు గ్రామసభ ల ఆమోదం తీసుకున్నామన్నారు. గ్రామసభల ఆమోదం పొందిన పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా భూమి పూజ చేసి సంక్రాంతి నాటికి పూర్తిచేసే విధంగా కార్యచరణ రూపొందించామని తెలిపారు. అందులో భాగంగా ఆదివారం రామచంద్రపురం మండలం వేలం పాలెం గ్రామంలో 23 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, ద్రాక్షారామంలోని నున్న వారి వీధిలో 3 లక్షల 50 వేల రూపాయలతో సీసీి రోడ్డు, కే గంగవరం మండలం బాలాంత్రం గ్రామంలో 31 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించామన్నారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను త్వరలోనే బాగుచేస్తామన్నారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల 70 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే మరిన్ని నిధులు తీసుకొచ్చి రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. రామచంద్రపురం మండలం వేలంపాలెం గ్రామంలో 17 లక్షల రూపాయల సీఎండీఎఫ్, జడ్.పి.జి.ఎఫ్ నిధులతో నిర్మించిన గ్రామీణ నీటి సరఫరా ఉప కార్యనిర్వహక ఇంజనీర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో రామచంద్రపురం, కే గంగవరం ఎంపీడీవోలు పద్మజ్యోతి, శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ యేసురత్నం, వేలం పాలెం, ద్రాక్షారామం బాలాంత్రం సర్పంచులు టేకుమూడి సునీత, కొత్తపల్లి అరుణ, శివరాం, ప్రజా ప్రతినిధులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.