- ప్రజా రక్షణకు.. వాళ్లది విశ్రాంతిలేని పహారా
- ఏపీ పోలీస్ అంటే.. ఎప్పటికీ స్పెషల్ బ్రాండ్
- నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని అణిచేసిన చరిత్ర
- పోలీస్ వ్యవస్థ.. ఇక మరింత బలోపేతం
- అధునాతన సాంకేతికతతో అనుసంధానం
- నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం
- సంక్షేమానికి ఏటా రూ.20 కోట్ల నిధులు
- రక్షణ వ్యవస్థను భ్రుష్టుపట్టించిన వైసీపీ
- సంక్షేమం, పటిష్టతను గాలికి వదిలేశారు..
- రూ.763 కోట్ల పెండిరగ్ బిల్లులు క్లియర్ చేశాం
- రానున్న రోజుల్లో 6100 పోస్టుల భర్తీ
- అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులంతా ప్రజా హృదయాల్లో త్యాగధనులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణ, ఆస్తులు కాపాడేందుకు రేయింబవళ్లు కర్తవ్య నిర్వహణకు సిద్ధమయ్యే పోలీసు సేవలను ఎంత కొనియాడినా తక్కువేనన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమర వీరులకు నివాళి అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు త్యాగాలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు వివరించారు. 1959, అక్టోబర్ 21న భారత్- చైనా సరిహద్దు లఢక్ లోయలో భారతదేశ పోలీస్ బృందంపై చైనా ఆకస్మిక దాడికి పాల్పడినపుడు.. ప్రాణాలకు తెగించి ప్రతిఘటించిన పోలీసుల్లో పదిమంది అశువులు బాశారని, ఆనాటి త్యాగధనులకు నివాళే సంస్మరణ కార్యక్రమాలని వివరించారు. రాష్ట్రంలోనూ ఎందరో పోలీసు అధికార్లు విధి నిర్వహణలో ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారంటూ.. ఐపీఎస్‌లు కేఎస్ వ్యాస్, పరదేశినాయుడు, ఉమేష్‌చంద్రలను స్మరించుకున్నారు. న్యాయం, ధర్మం, ప్రజల కోసం పనిచేశారని నివాళి అర్పిస్తూ.. వారందరి ఆత్మకు శాంతికలగాలన్నారు. త్యాగధనుల స్ఫూర్తి ప్రతి పోలీస్‌లోనూ ఉందంటూనే.. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు. సమాజ హితానికి జరిగే కృషిలో పోలీసులే కీలకమంటూ.. సంఘ విద్రోహ శక్తుల భరతం పట్టడంలో పోలీసుల కృషి వెలకట్టలేనిదన్నారు. 24/7 విధులు నిర్వర్తించేది పోలీసులేనని, విజయవాడ వరదలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సమయంలో పోలీసుల పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబునిచ్చారు.
శాంతి, భద్రతలకు తొలి ప్రాధాన్యం
దేశంమొత్తంమ్మీద ఏపీ పోలీస్ ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందారని, నక్సలిజం, కమ్యూనల్ హింస, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచేసిన ఘనత ఏపీ పోలీసుదేనన్నారు. జీరో క్రైంకు ఏపీ చేరాలని, నేరానికి పాల్పడాలంటేనే భయపడే పరిస్థితి రావాలంటూ.. అందుకు పటిష్ట పోలీస్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శాంతి భద్రతలే మొదటి ప్రాధామ్యమంటూనే.. పోలీసు సంక్షేమం బాధ్యతగా.. వ్యవస్థ పటిష్టత కర్తవ్యంగా భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం..
రాష్ట్ర విభజన తరువాత పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు. వ్యవస్థ బలోపేతానికి వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యాలు సమకూర్చామన్నారు. అందుకు రూ.600 కోట్లు వెచ్చించామని, కొత్త వాహనాలకు రూ.150 కోట్లు, పోలీస్ స్టేషన్లు, క్వార్టర్ల ఆధునికీకరణ, మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్, టెక్ టవర్ నిర్మాణానికి రూ.170 కోట్లు వెచ్చించామన్నారు. పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60కోట్లు, రూ.27కోట్లతో ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశామన్నారు. పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు కేటాయించినట్టు వివరించారు. కమ్యూనికేషన్ సిస్టమ్, డేటాసెంటర్‌కు రూ.25 కోట్లు, ఆయుధాలు, మొబిలిటీ, ఇతర నిర్మాణాలకు రాష్ట్రవాటాగా రూ.80 కోట్లు, ఈ-ఆఫీస్‌కు రూ.20 కోట్లు ఖర్చు చేశామన్నారు. 617 పనులకు రూ.320 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పోలీస్ శాఖలో గ్రేహౌండ్స్‌కు పునాధులు వేశామంటూనే.. విశాఖపట్నంలో ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పామన్నారు.
‘కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తోంది. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండిరగులో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. దిశ పేరుతో వాహనాలకు రూ.16 కోట్లు, కమ్యూనికేషన్ పరికరాల కోసం రూ.20కోట్లు పెండిరగ్ పెడితే వాటినీ చెల్లించాం. తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరం. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి’’ అని చంద్రబాబు సూచించారు.
కక్ష సాధింపులు, రాజకీయ వేధింపుల కోసం గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోపర్చిందంటూ.. అందుకు ప్రతిష్టాత్మక ఐపీఎస్ వ్యవస్థనే ప్రయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే వ్యవస్జ అని, నేరస్థులు ఏరూపంలో వచ్చినా పసిగట్టి సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థగా అభివర్ణించారు. ఆనాటి ముఖ్యమంత్రి రక్షణ కోసం రూ.12 కోట్లతో కంచె వేసుకున్నారుగానీ, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నిర్వహణకు ఐదేళ్లలో రూ.10 కోట్లు ఇవ్వలేకపోయారన్నారు. మరోవైపు సర్వే రాళ్లపైన రూ.700 కోట్లు తగలేసిన వ్యక్తి, నేరాల నియంత్రణకు ఎంతో ఉపయుక్తమైన సీసీ టీవీ కెమెరాలకు రూ.700 కోట్లు ఇవ్వలేకపోయారన్నారు. ఈ మొత్తం ఇచ్చుంటే ఈరోజు అఘాయిత్యాలు జరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. విశాఖలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి, పోలీసులకు సరెండర్ లీవ్‌లు ఇవ్వకపోవడం బాధాకరన్నారు. నాకు కూడా పెను సవాళ్లు ఉన్నాయని, రూ.10,50,000 కోట్లు గత ప్రభుత్వం వారసత్వంగా తీసుకున్న అప్పులన్నీంటికీ వడ్డీ చెల్లించాలన్నారు. అప్పులు చెల్లించాల్సి ఉంది, ఇదే సమయంలో మీ సంక్షేమానికి పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు:
నేడు పోలీసు శాఖలో అనేక సవాళ్లు ఉన్నాయి, సైబర్ నేరాలూ పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. నేరగాళ్ల కంటే మెరుగ్గా మనం టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటే శాంతిభద్రతలను కాపాడగలమన్నారు. మనది పైచేయి అయినప్పుడే నేరగాళ్లను కట్టడిచేయగలుగుతామన్నారు. ‘కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ముసుగు తీసి శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసులకు అండగావుండే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 1995 నుంచీ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. బాడీ వార్న్ కెమెరాలు తీసుకొచ్చాం. సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించే వ్యవస్థ తెచ్చాం. డ్రోన్స్, సీసీటీవీ, సెల్‌ఫోన్లను సమర్థంగా ఉపయోగించుకోగలిగితే, రియల్‌టైమ్ పరిస్థితిని మానిటరింగ్ చేయగలిగితే.. నేరస్తులు దగ్గరకొచ్చేందుకు భయపడతారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మూడో నేత్రం మన పోలీసు వ్యవస్థ అంటూ.. ఆ మూడో నేత్రానికి సహకరించే వ్యవస్థ టెక్నాలజీగా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతి సెన్సిటివ్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరా ఉంటుందని, అది కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై.. అనలిటిక్స్, డేటాను మానిటర్ చేస్తామన్నారు. ఎవరైనా రౌడీయిజం చేయాలని చూస్తే అదే వారికి చివరిరోజు కావాలనేది ఆకాంక్షగా వివరిస్తూ.. ఆవిధంగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు రాక్షసుల మాదిరి మహిళలపై అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ‘ఆడబిడ్డలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మోసగాళ్ల ట్రాప్‌లో పడొద్దు. ప్రతికేసునూ సవాలుగా ఛేదిస్తాం. చట్టపరంగా శాశ్వత పరిష్కారం చూపుతాం’ అన్నారు. హిందూపురం, బద్వేల్, బాపట్ల ఘటనలకు సంబంధించి మూడు కేసులనూ ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నామన్నారు. తద్వారా తప్పుచేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. నేరగాళ్లకు గుణపాఠం తప్పదన్నారు. పోలీసు శాఖను తక్కువగా అంచనా వేయొద్దని, నేరగాళ్లను పకడ్బందీగా కట్టడి చేస్తామని హెచ్చరించారు. ‘గత ప్రభుత్వం రూ.763 కోట్లమేర పోలీసులకు సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, టీఏ బిల్లులు లాంటివి పెండిరగ్‌లో పెట్టింది. నేను హామీ ఇస్తున్నా. అంచెలవారీగా వాటిని పరిష్కరించి.. పోలీసు శాఖకు సహకరిస్తా. పెండిరగ్‌ను క్లియర్ చేస్తా. రానున్న రోజుల్లో 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఏడాదినుంచి పోలీసు సంక్షేమం కోసం కనీసం రూ.20 కోట్లు ఇస్తాం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి అమరావతిలో ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుందాం. వచ్చే ఏడాదినుంచి అక్కడే సంస్మరణ జరుపుకుందాం. 2047నాటికి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా తయారవుతుంది. మన రాష్ట్రాన్నీ తీర్చిదిద్దే బాధ్యత మన పోలీసు వ్యవస్థపై ఉంది. అందుకు అంతా సన్నద్ధమవ్వాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.