- కీలక మార్గాల్లో పటిష్ఠ పర్యవేక్షణకు చర్యలు
- సామాన్యుల ఫిర్యాదులకూ వ్యవస్థ ఏర్పాటు
- దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు
- ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి కొత్త ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): పొరుగు రాష్ట్రాలకు ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు, లభ్యత పెంచేందుకు సీనరేజి రద్దు చేసినట్టు సీఎం పునరుద్ఘాటించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో తరలింపు అధికంగా జరుగుతోందని, ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ‘గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపునకు అనుమతిచ్చాం. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలి. రీచ్‌ల్లో తవ్వకాలు, లోడిరగ్ ప్రైవేటుకు అప్పగింతపై ఆలోచించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లాస్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలి. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలి. ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా ఎక్కడైనా దుర్వినియోగం చేసినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.