- పోలీసులు తొత్తులుగా మారి సహకరించారు
- బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి వేధించారు
- న్యాయం చేయాలని ప్రజావేదికకు అర్జీదారులు
- పెద్దిరెడ్డి అండతో భూములు కొట్టేసిన కజిన్ బ్రదర్
- దివ్యాంగుల స్థలాలు కొట్టేసి వ్యభిచారం నిర్వహణ
- వైసీపీలో చేరలేదని ఇంటికి వెళ్లే దారి మూసేశారు
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో వైసీపీ నేతల భూకబ్జాలపై ప్రజావేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారి భూకబ్జాలకు అధికారులు, పోలీసులు అండగా నిలిచి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన వైనంపై న్యాయం చేయాలని నేతలకు ప్రజావేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుండగా కేసులు పెట్టినా నాడు పోలీసులు పట్టించుకోకపోగా తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించి వేధించారని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన దివ్యాం గుల ఇంటి స్థలాలను ఇప్పించి తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మంత్రి టీజీ భరత్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబులు అర్జీలు స్వీకరించారు.
` గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి కజిన్ బ్రదర్ అయిన పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి అక్రమంగా తమ భూములను ఆక్రమించుకున్నారని..తహసీల్దార్, వీఆర్వోలు వారికి సహక రించారని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన కె.చోలేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి తమ భూమిని ఇప్పించాలని, అక్రమార్కులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని భూ కబ్జా చేసిన పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తాను టీడీపీ కార్యకర్తను కావడంతో వైసీపీలో చేరమంటే చేరలేదన్న కక్షతో తన ఇంటి కి వెళ్లే దారిని రెండు వైపులా మూసివేశారని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం ఇందిరానగర్‌కు చెందిన నూతలపాటి జయచంద్రనాయుడు ఫిర్యాదు చేశారు. అప్పటి అధికారులు కూడా వైసీపీ నేతలకే కొమ్ము కాశారని..దారికి అడ్డంగా ఉన్న గోడలను తొల గించి దారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` తన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూశారని..కోర్టుకు వెళుతుంటే దాడి చేశారని సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం చంద్రగిరికి చెందిన జి.మధు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే సీఐ శ్రీహరి వైసీపీ నేతలకు తొత్తుగా వ్యవహ రించి ఫిర్యాదును మార్చి రాసి బలవంతంగా తన చేత సంతకాలు చేయించారని వివరించారు. మరుసటిరోజు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని సీఐ, ఎస్‌ఐ హరూన్‌బాషాలు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి వైసీపీ నేతలకు అనుకూలంగా అగ్రిమెంట్ తయారు చేయించి కోటిన్నర ఇవ్వాలంటూ బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని వివరించారు. తన ఇంటికి వచ్చి రూ.7 లక్షల నగదు, రూ.31 లక్షల ప్రామిసరీ నోట్స్ తీసుకెళ్లారని.. దీనిపై నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని నాడు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొల గించి తన భూమిని కబ్జా చేయాలని చూసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో తమ భూమని అక్రమంగా వీఆర్వో మరొకరి పేరు మీదకు మార్చారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామానికి చెందిన చలిచీమ శంకరావు తెలిపారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా తనకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకుని తనకు తన భూమిని ఇప్పించాలని వేడుకున్నారు.
` జడ చక్రి, కె.మహేష్ అను వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా తమ ఇంటిని కూల్చడమే కాకుండా రౌడీలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తిరుపతి మండలం తిరుపతికి చెందిన కె.సి.సునీత ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. వాళ్లకు అడ్డు వెళితే తలలు తీసేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణ రక్షణ కల్పించి బెదిరింపులకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
` నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మూసివేతతో రోడ్డునపడ్డ దాదాపు 230 మంది కార్మికులు గ్రీవెన్స్‌లో తమ గోడు చెప్పుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో తామంతా రోడ్డున పడ్డామని.. 2019లో జగన్ రెడ్డికి తమ గోడు చెప్పుకోగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. తమను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
` తనను మోసం చేసి పెళ్లి చేసుకుని కాపురానికి పనికిరాని భర్త నుంచి విడాకులు అడుగుతుంటే తనను, తన తల్లిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వారి నుంచి కాపాడి విడాకులు ఇప్పించాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంకు చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చింది.
` వినుకొండ మండలం గోకనకొండలో ఉన్న తన భూమిని వైసీపీ నేతలు ఆక్రమిం చుకున్నారని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన వెంకటరామయ్య ఫిర్యాదు చేశారు. భూ కబ్జాపై రెవెన్యూ అధికారులను, పోలీసులను ఆదేశించి తమ భూములు ఇప్పించాలని వేడుకున్నారు.
` ఇంటికి కాంపౌండ్ గోడ కట్టుకోవడానికని లక్ష రూపాయలు పెట్టి తెచ్చుకున్న రాళ్లను దొంగిలించారని, ఇంటి పరిసరాల్లో పెరుగుతున్న చెట్లను నరికేసి తీసుకెళ్లారని కడప జిల్లా చెన్నూరు మండలం గుర్రంపాడు గ్రామానికి చెందిన మర్రి అరుణాదేవి ఫిర్యాదు చేసింది. దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరింది.
` ప్రకాశం జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన రిటైర్డ్, వీఆర్‌ఎస్ ఉద్యోగులు తమ సమస్యను వివరిస్తూ తమకు వివిధ పద్దుల కింద కంపెనీ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉందని, డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.