- తల్లి,కొడుకుల మధ్య ఆస్తుల ఎంఓయూనా..
- మంత్రి నిమ్మల రామానాయుడు విసుర్లు
- ఆ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టీకరణ
- ఉచిత ఇసుకలో నేతల జోక్యం వద్దని హితవు
రాజమహేంద్రవరం (చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ క్యారెక్టర్ ఎంటో దేశమంతా అర్థమైందన్నారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశానికి తొలిసారిగా తెలిసిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అమల్లో సమస్యలు గుర్తించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ సమస్యలపై శనివారం అధికారులతో జరిపిన సమావేశంలో చర్చించామని తెలిపారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఓపెన్ ఇసుక రీచ్‌ల్లో వారం రోజుల్లో ఇసుక తవ్వకాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. వైసీపీ పాలనలో టన్ను ఇసుక రూ.625 ఉంటే ప్రస్తుతం రూ. 215కే అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఉచిత ఇసుక పంపిణీలో స్థానిక నేతలెవరూ జోక్యం చేసుకోవద్దు. ఇసుక సరఫరాలో అక్రమాలకు పాల్పడే నేతలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్‌ను అధిక రేట్లకు కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల విమర్శించారు.
సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. వారి శ్రేయస్సు కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేవలం రూ.100 కడితే రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ ప్రమాద బీమా అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మందితో సభ్యత్వం చేయించే దిశగా నేతలు, కార్యకర్తలు కష్టపడాలి. పాడైన రోడ్లకు మూడు నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. లిప్ట్ ఇరిగేషన్‌లకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నవంబర్ 6వ తేదీ లోగా ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 70 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీయే అభ్యర్థులను గెలిపించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ నేతలంతా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ శ్రమించాలి. సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ మనదే విజయం కావాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పని చేయాలని మంత్రి నిమ్మల పిలుపు ఇచ్చారు.