- ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ లక్ష్యం
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి (చైతన్యరథం): ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండలో 10 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ రాబోయే రోజులలో మరిన్ని నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు సులభతరమైన రవాణా సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయాణికుల సంక్షేమమే ప్రధానమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇకనుంచి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. గత ఐదేళ్లలో ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమయిందని, రాబోయే రోజుల్లో ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.