- ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
- చంద్రబాబును కలిసిన క్రికెటర్ కపిల్‌దేవ్
- రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్‌ల ఏర్పాటుపై చర్చ
- ‘ఎక్స్’లో ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్‌దేవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి కపిల్‌దేవ్.. ముఖ్యమంత్రిని కలిశారు. కపిల్‌దేవ్‌తో వివిధ క్రీడాంశాలపై చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
‘ఈరోజు లెజెండరీ క్రికెటర్ మరియు ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మిస్టర్ కపిల్‌దేవ్, అతని ప్రతినిధి బృందంతో సమావేశం కావడం ఆనందంగా ఉంది. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ మరియు అనంతపురం మరియు వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ క్రీడారంగాన్ని విస్తరించడం గురించి మేము చర్చించాము. ఇది మన యువతలో గోల్ఫ్‌పట్ల మక్కువను పెంపొందిస్తుంది. తదుపరి తరం గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మన పౌరులకు ఇలాంటి మరిన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా నైపుణ్యానికి నిజమైన హబ్‌గా మార్చడానికి క్రీడా చిహ్నాలతో సహకరించడానికి మేము ఎదురుచూస్తున్నాము’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
క్రీడలపై సీఎంకు ఆసక్తి ఎక్కువ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించారు. సమావేశం అనంతరం కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడారు. ‘క్రీడలపై సీఎం చంద్రబాబు చాలా ఆసక్తిగా ఉన్నారు. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇండియన్ గోల్ఫ్ అధ్యక్షుడిగా ఉన్నా. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే నిర్ణయం. స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తా’ అని కపిల్ దేవ్ తెలిపారు. అనంతపురం అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్సులు పెడతామని కేశినేని చిన్ని తెలిపారు. ‘ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరాం. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నాం. గోల్ఫ్ డ్రైవింగుకు రేంజ్‌లు సిద్ధం చేస్తాం. తదుపరి సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తాం’ అని శివనాథ్ వ్యాఖ్యానించారు.