శ్రీకాకుళం (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లాను అన్నివిధాలా అభివృద్ధిపథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగు దొడ్లు, గృహస్థలం, గృహ నిర్మాణం ఉండాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. వాటితో పాటు విద్య, వైద్యం, రోడ్లు, వీధిదీపాలు, కాలువలు వంటి అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తెలిపారు. ఇందుకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత తమ ప్రభుత్వంలో చెత్తను రిక్షా ద్వారా కలెక్ట్ చేసి, రీసైకిల్ చేయడం జరిగేదన్నారు. దాన్ని నిర్వీర్యం చేసి.. రాష్ట్రంలో చెత్త పేరుకుపోయేలా చేశారని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్‌జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్నీ నిర్వీర్యం చేసారన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పక్కాగా అమలుచేస్తూ ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్టు సీఎం తెలిపారు. ఇందుకు అందుబాటులోవున్న నీటివనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు మాసాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం లేనిపోని పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ఐదేళ్ల పాలనలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చేందుకు విజయనగరం జిల్లాలో నవంబర్ 2న పనులు ప్రారంభించి, రాష్టంలో గుంతలులేని రహదారులుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిరదని, గత ప్రభుత్వం నిర్వాకం వలన మరింత వెనుకబడిరదన్నారు. ఇప్పటికైనా ప్రతి ప్రభుత్వ శాఖలు పనుల పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయాని, వ్యక్తిగత ప్రాధాన్యత తప్ప, ప్రజా ప్రయోజనం గురించి ఆలోచన చేయలేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలన్నారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక ఇసుకను పూర్తిగా ఉచితం చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
గతంలో లిక్కర్‌పై దోపిడీ జరిగిందని, ఆ విధాన్ని గాడిలోకి తెచ్చామన్నారు. అయితే సంబంధిత యంత్రాంగం బెల్ట్‌షాపులు లేకుండా, అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక, మద్యం విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, బాధ్యులను జైలుకు పంపేందుకు వెనుకాడబోమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీలివ్వడం జరిగిందని, వాటి అమలుకు అందరూ సహకరించి స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఇంటికి ఒక ఐటి ప్రతినిధి ఉండాలని, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయ, పరిశ్రమలువంటి వాటిలో పురోగతి ఉంటుందని, తద్వారా అభివృద్ధి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. ఇందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నారు. ఒక శాతం గ్రోత్ అంటే దాదాపు 16వేల కోట్లు ఉంటుందని, అందుకే స్వర్ణాంధ్ర విజన్ -2047 పేరిట ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పినట్లు తెలిపారు. అదే జరిగితే ఆర్ధిక వృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంటుందన్నారు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మారిందని, ఎంత కష్టపడి పనిచేశామని కాకుండా, ఎంత స్మార్ట్‌గా పనిచేసామన్నదే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ఉపాధి, వ్యవసాయం, ఉద్యానవనం తదితరమైనవి మెరుగుపరచడం ద్వారా గ్రామాలు అభివృద్ధి సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జీరో పావర్టీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ వంటివి ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి జరుగుతుందన్నారు. వాటర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని, జిల్లాలో వంశధార.. బహుదా నదులను అనుసంధానిస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. వాటర్ కన్వర్జేషన్‌పై ప్రత్యేకత సాధించాలని, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయాలన్నారు. దీపం`2 ద్వారా అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టామన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్ మెదటి స్థానంలో నిలుస్తుందన్నారు. జిల్లాలో కొన్ని అధిక ప్రాధాన్యత అంశాలు చేపడతామని హామీ ఇచ్చారు. అందులో రూ 4,360 కోట్లతో మూలపేట పోర్ట్ అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూలపేట నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే ఇరిగేషన్ అభివృద్ధిలో బహుద నుంచి పెన్నా వరకు పనులు, నేటికి పూర్తైన ఇరిగేషన్ పనులపై సమీక్షించారు.
వంశధార ఎడమ కాలువ పనులు చేపట్టవలసి ఉందని, దానికి సంబంధించిన అనుమతులు ఇప్పించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరగా ప్రాధాన్యత క్రమంలో అందుకు కావలసిన చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శివారు గ్రామానికి సాగునీరు అందటం లేదని, అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ నారాయణపురం శివారు భూములకు నీరందటం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మడ్డువలస పనులపై ఇరిగేషన్ ఎస్‌్‌ఈని సీఎం ఆరా తీయగా.. నిధులు, చేపట్టిన పనుల వివరాలు వెల్లడిరచారు. శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్‌పై జరిపిన సమీక్షలో పలువురు కార్పొరేషన్ అభివృద్ధికి పలు సూచనలు అందజేయగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంచలంచాలుగా పనులు పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు.
కోడి రామమూర్తి స్టేడియం పనులు పురోగతి లేదని, అలాగే ఆముదాలవలస రోడ్డు పనుల మందకొడిగా జరుగుతున్నాయని పలువురు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్లు పనులు నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సీఎ హెచ్చరించారు. అరసవిల్లి దేవాలయానికి సంబంధించిన సమావేశంలో సుందరీకరణ, అభివృద్ధి పనుల నిమిత్తం రూ.100 కోట్లు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు. సీఎం మాట్లాడుతూ నాగావళి బ్యూటిఫికేషన్, ఇంటిగ్రేషన్ కలెక్టరేట్, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయివేట్ హోటల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అందుకు కావలసిన స్థల పరిశీలన చేయాలన్నారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రాలపై సమీక్షించగా డిసిహెచ్‌ఎస్ మాట్లాడుతూ ఉద్దానం ఏరియాలో 18 పీహెచ్సీలు, 5 యూపీహెచ్‌ఎస్‌లు, 6 సీహెచ్‌సీలు ఉన్నాయన్నారు. డయాలసిస్ కేంద్రం బాగా నడుస్తుందని వివరించారు.
గృహ నిర్మాణాలపై జరిపిన సమీక్షలో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు మాట్లాడుతూ చాలామంది లబ్దిదారులకు గృహ నిర్మాణ బిల్లులు అందలేదన్నారు. సీఎం మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిపై చర్యలు చేపడతామన్నారు.
వైన్స్ షాపులు నిర్వహణపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెల్ట్ షాపులు నిర్వహించుకూడదని, షాపులు నిర్వహిస్తున్న వారిపై పెనాల్టీ వేయడమే కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అమలులో యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇసుక విధానం అమలుపై అక్రమాలు చేపడితే పిడి యాక్ట్ అమలు చేస్తామన్నారు. మూలపేటలో ఇండస్ట్రీలు, ఫార్మసీ ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టబోయే ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలు, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, ఎన్ ఈశ్వరరావు, గౌతు శిరీష, బెందాళం అశోక్, మామిడి గోవిందరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.