- ఉమ్మడి రాష్ట్రంలోనే దీపం అమలు చేసిన సీఎం చంద్రబాబు
- నేడు దీపం`2తో ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు
- చిత్తూరు జిల్లాలో పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
చిత్తూరు (చైతన్యరథం): దీపం పథకం ద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు నియోజకవర్గం గుడిపాల జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దీపం-2 కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో లాంఛనంగా పండుగ వాతావరణంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, జీడి నెల్లూరు, పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, డా. వీఎం థామస్, కలికిరి మురళీ మోహన్‌లతో కలసి మంత్రి మండిపల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మహిళలను ఉద్దేశించి మంత్రి మండిపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే దీపావళి పర్వదినాన దీపం-2 పథకాన్ని ప్రారంభించారన్నారు.
గతంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొనే మహిళల కష్టాలను తొలగించేందుకు 1990లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం అమలు చేశారన్నారు. లక్షలాది కుటుంబాల్లో వెలుగునిచ్చిన ప్రదాత ఆయన అని కొనియాడారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.2,600 మేర లబ్ధి కలుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. సామాజిక పెన్షన్ రూ. 4000కు పెంపు, ఉచిత ఇసుక, 16, 500 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ఇప్పటికే అమల్లోకి వచ్చాయని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి మండిపల్లి హామీ ఇచ్చారు.
చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో అనేక సంస్థలను తీసుకొని వచ్చి చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు పోర్టులు, కంపెనీలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా పేద మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూట్టామన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఉచిత సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమమనేది మొదలయిందే దివంగత ఎన్టీ రామారావు పాలనలో అని గుర్తు చేశారు. అదే విధంగా సూపర్ సిక్స్‌లో ఇచ్చిన ఇతర హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు.
గంగాధర నెల్లూరు(జీడీ నెల్లూరు) ఎమ్మెల్యే వీఎం థామస్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం చంద్రబాబు బాటలోనే జిల్లాలోని ఎమ్మెల్యేలందరం నడిచి జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామన్నారు. జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, ఐటీ, ఫుడ్ ప్రోసెసింగ్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్ ఇండస్ట్రీలు తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు దొరబాబు, ఎ.ఎస్.మనోహర్, గాంధీ, మాజీ మేయర్ కఠారి హేమలత, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్‌ఓ శంకరన్, మండల అధికారులు, నాయకులు,పెద్ద ఎత్తున మహిళలు, తదితరులు పాల్గొన్నారు.