- రాష్ట్రానికి ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ రావటం వెనక యువనేత మంత్రాగం
- భారీ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు యోచిస్తున్నారని తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన మంత్రి లోకేష్
- ఒక్కసారి మాట్లాడటంతోనే వారిని ఒప్పించిన చాతుర్యం
- వ్యక్తిగతంగా అతిపెద్ద విజయం
అమరావతి (చైతన్యరథం): ఒక్క జూమ్ కాల్‌తో రాష్ట్రంలోకి లక్షా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహం. వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సాధించిన అద్భుతమైన ఘనత ఇది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా అతి భారీ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు యోచిస్తున్నాయనే విషయం తెలిసిన వెంటనే యువనేత లోకేష్ రంగంలోకి దిగిపోయారు. ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో జూమ్ కాల్‌లో సంప్రదింపులు జరిపారు. ఇటీవలి కాలంలోనే అత్యంత భారీ పెట్టుబడితో మెగా స్టీల్ పరిశ్రమను ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేసేందుకు వారిని ఒప్పించారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక్క జూమ్ కాల్ మీటింగ్‌తో లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులను ఖరారు చేశారని జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్ పత్రిక సవివర కథనాన్ని ప్రచురించింది.
ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అత్యంత భారీ స్టీల్ పరిశ్రమ పెట్టబోతున్నాయి. రెండు దశలుగా లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతాయి. తొలి దశలో 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తాయి. తరువాతి దశలో 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 10.5 మిలియన్ టన్నులకు పెంచుతాయి. ప్లాంటు ఏర్పాటుకు తీర ప్రాంతంలో 2600 ఎకరాల స్థలంతో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం ఓ ప్రైవేటు జెట్టీ (పోర్టు) ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం తాము అన్వేషించామని ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధి ఎకనమిక్ టైమ్స్‌కు తెలిపారు. ఒడిశాతో పాటు ఏపీలోనూ పలు ప్రదేశాలు పరిశీలించామన్నారు. ఏపీలోని నక్కపల్లి ప్రాంతం అనువుగా ఉందన్నారు. అక్కడ ఫార్మా కంపెనీల కోసం సేకరించిన 2200 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో పాటు, ప్రైవేటు జెట్టీ నిర్మాణానికి అనువైన తీర ప్రాంతం ఉందన్నారు.
మరికొద్దిగా భూమి సేకరిస్తే సరిపోతుంది. రెండో దశలో విశాఖ`చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రతిపాదించిన భూములు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్సెలార్ మిట్టర్ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో లోకేష్ ఒక్కసారి జూమ్ కాల్‌లో మాట్లాడటంతో పెట్టుబడులకు అంతా సిద్ధమైపోయిందని ఎకనమిక్స్ టైమ్స్ తెలిపింది. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్సెలార్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్‌తో మాట్లాడి డీల్ ఖరారు చేశారని తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తిదారులు. ఉత్పత్తి చేసే దాంట్లో అత్యధిక భాగం ఎగుమతి చేస్తారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్రతో పాటు మొత్తం రాష్ట్రాన్నే ఆర్థికంగా మరింత బలోపేతం చేయనుంది. ఈ ఏడాదిలోనే ఒప్పందాలు పూర్తయిపోయి.. త్వరలోనే పరిశ్రమ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. 2029 నాటికి తొలి దశ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఈ పరిశ్రమ రావటం లోకేష్ సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.