అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ఇలా ఉంటే ఏపీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ లేదంటున్న జగన్ రెడ్డి .. ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. కూటమి ప్రభుత్వం జూన్‌లో ఏర్పడినప్పటికీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉండటంతో ఓటాన్ అకౌంట్ మీదుగానే నడిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం లెక్కలు తేల్చుకుని బడ్జెట్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. పథకాలకు డబ్బులు లేక బడ్జెట్ పెట్టడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ పథకాలను ఒకటి తర్వాత ఒకటి ఎలా అమలు చేయాలో సీఎం చంద్రబాబుకు ఓ స్పష్టత ఉంది. ఇప్పటికే ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కీలకమైన పథకాలు. ఈ రెండిరటికే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని తెలుస్తోంది.