- వినియోగదారుల ఆరోగ్యమే ధ్యేయంగా పరీక్షలకు నూతన ప్రామాణికాలు
- ప్రాంతీయ ఎక్సైజ్ లేబొరేటరీల్లో అందుబాటులో గ్యాస్ క్రోమోటోగ్రఫీ విధానం
- బ్లెండ్ పరీక్షకు 9, ఇఎన్‌ఏ పరీక్షలకు 13 పరామితులు
అమరావతి (చైతన్యరథం): వినియోగదారులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం నూతనంగా విభిన్న ప్రామాణికాల మేరకు పరీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటి వరకు కేవలం ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇఎన్‌ఎ) నమూనాలను పరీక్షించి అరు రకాల ప్రామాణికాల మేరకు పరిశీలించేవారని ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా ఆధునీకరించామన్నారు. ప్రాంతీయ ఎక్సైజ్ లాబొరేటరీల్లో ఆరు ప్రాథమిక ప్రామాణికాల మేరకు ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇఎన్‌ఏ) నమూనాలను ఇథైల్ ఆల్కహాల్, అసిడిటీ, ఆల్డిహైడ్స్, మిథనాల్, నీటిలో కలయిక పరీక్షలు మాత్రమే నిర్వహించేవారన్నారు. మరో వైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ రూపంలో ఉత్పత్తి అయ్యే విస్కీ, బ్రాందీ, వోడ్కా, జిన్, రమ్‌లకు సంబంధించి బాటిలింగ్ చేయడానికి ముందు మిశ్రమ నమూనాల్లో ఆల్కహాల్ శాతం (స్ట్రెంత్) మాత్రమే లెక్కిస్తున్నారు. ఇలా కేవలం ఒక పరామితి మేర మాత్రమే ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ అదేశాల మేరకు ఇప్పుడు ఈ విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా ముందడుగు వేస్తున్నారు.
ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, బ్లెండ్ (బాటిలింగ్‌కు ముందు సిద్ధం చేసిన నమూనా)లను పరీక్షించడానికి గ్యాస్ క్రోమోటోగ్రఫీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని కొల్లు రవీంద్ర వివరించారు. ఇది సాంకేతికంగా ఉన్నతమైన విధానంగా గుర్తింపు పొందింది. వైజాగ్, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కాకినాడల్లోని రీజనల్ ప్రోబెషనరీ, ఎక్సైజ్ లేబొరేటరీల ద్వారా బాటిలింగ్‌కు ముందు అన్ని రకాల మద్యాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా వివిధ రకాల పరీక్షల కోసం కొత్త పరామితులు నిర్ణయించామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. అత్యాధునిక విధానాలను అనుసరించి ఇఎన్‌ఏను పరీక్షించడానికి 13 పరామితులు సిద్దం చేసారు. బ్లెండ్ (విస్కీ, బ్రాందీ, వోడ్కా జిన్) పరీక్షలకు తొమ్మిది పరామితులు నిర్ణయించారు. నూతన ప్రామాణీకాల అమలు ఫలితంగా కెమికల్ రియాక్షన్ వంటి పరిస్థితులను అడ్డుకోగలుగుతామన్నారు. ఇది మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ఉపకరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.