- ప్రభుత్వం సీరియస్
- కడప ఎస్పీ బదిలీ, సీఐ సస్పెన్షన్
అమరావతి (చైతన్యరథం): కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు పడిరది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. మరోవైపు కడప జిల్లాలో మరో సీఐని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఫిర్యాదులు వచ్చాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాజ్, మంత్రులు లోకేష్, అనితపై సామాజిక మాధ్యమాల్లో రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే..
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీంద్ర.. వైసీపీ హయాంలోనూ, ప్రభుత్వం మారిన తరువాత కూడా టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. అదే తీరు కొనసాగించాడు. వర్రా రవీంద్రారెడ్డిపై చాలా కేసులు కేసులు ఉన్నాయి. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం కడప పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పులివెందులకు చెందిన ఓ వైసీపీ నాయకుడి సూచనల మేరకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
తీవ్ర దుమారం
నోటీసులు ఇచ్చి వదిలేసిన సమయంలో రవీంద్రరెడ్డిని మరో కేసులో అదుపులోకి తీసుకోవడానికి రాజంపేట పోలీసులు మంగళవారం రాత్రి కడప తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. కానీ, కడప పోలీసులు అతడిని రాజంపేట పోలీసులకు అప్పగించకుండా నేరుగా బయటకు పంపించేశారు. రాజంపేట పోలీసుల కళ్లుగప్పి రవీంద్ర అక్కడి నుంచి పారిపోయాడు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం టీడీపీ, జనసేన నేతలనే కాకుండా జగన్ తల్లి విజయమ్మ, చెల్లెళ్లు షర్మిల, సునీతను కూడా రవీంద్రారెడ్డి దూషించారు. రంకులు అంటగట్టారు. ఆయన సోషల్ మీడియా పేజీలన్నీ జుగుప్సాకరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తిని పోలీసులే తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డిని పోలీసులు వదిలేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్‌ను వెంటనే కడప వెళ్లి.. కేసు వివరాలు ఆరా తీయాలని ఆదేశించింది. ఈ మేరకు డీఐజీ ప్రవీణ్ కడప వెళ్లి, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో భేటీ అయ్యారు. రవీంద్ర ఎలా తప్పించుకున్నాడు.. ఎక్కడ పొరపాటు జరిగిందన్నదానిపై ఆరా తీశారు. ఇదే సమయంలో రవీంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వైసీపీ నేత ఒకరి కనుసన్నల్లో రవీంద్ర ఉండటంతో అతడికి కూడా పోలీసులు ఫోన్ చేసి, ఆరా తీసినట్లు సమాచారం.
ఐదేళ్లపాటు చంద్రబాబు, లోకేష్, పవన్ లక్ష్యంగా పోస్టులు పెట్టిన రవీంద్ర… పోలీసులకు చిక్కితే… తమదైన శైలిలో విచారించాల్సిన పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి పంపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం లోపు రవీంద్రను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇతడిపై పులివెందుల, కడప, మంగళగిరి, రాజంపేటతోపాటు హైదరాబాద్‌లోనూ కేసులున్నాయి. దాదాపు 30 కేసుల వరకు నమోదై ఉంటాయని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం
`