- ఎమ్మెల్సీ ఎన్నికలపై అశోక్‌బాబు పిలుపు
- ఓటు నమోదు గడువు పెంచాలని విజ్ఞప్తి
అమరావతి (చైతన్య రథం): సర్వర్ సమస్య కారణంగా ఓటర్ల నమోదు మందగించిన నేపథ్యంలో.. గ్రాడ్యుయేషన్ ఓటర్ల నమోదు సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్టు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు వెల్లడిరచారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ… గతంలో ప్రతిపక్షంలో ఉండి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించామని, ఈసారీ అదే పరిస్థితి కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజల్లో నమ్మకం పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. గుంటూరు, కృష్ణా ఈస్ట్, వెస్ట్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓటర్ల నమోదు కావడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం ముగుస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ రెండు జిల్లాలతోపాటు అటు విశాఖపట్నంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ మరియు తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి సీటు కూడా ఖాళీ ఉంది.
విజయవాడలో జరిగిన వరదల కారణంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ఓటు నమోదు కార్యక్రమం ఆలస్యమైంది. గత సెప్టెంబరు 30నే నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. నేడు కూడా సర్వర్ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుకు గడువు తేదీని పెంచాలని అశోక్‌బాబు కోరారు. గతంలో తూర్పు రాయలసీమ, వెస్ట్ రాయలసీమలలో నాడు అపోజిషన్‌లో ఉన్నా ఆశాదీపంలాగ పోటీ చేసి టీడీపీ అభ్యర్థులు గెలిచామని గుర్తు చేశారు. అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను తూ.చ తప్పక పాటించాలని అశోక్‌బాబు కోరారు. కూటమి బలపర్చిన అభ్యుర్థులను గెలిపించుకుంటేనే కౌన్సిల్ ప్రక్షాళన సాధ్యమవుతుందని, కౌన్సిల్ పోరాటంతోనే మూడు రాజధానుల బిల్లు వీగిపోయిన విషయం అందరూ గ్రహించాలని అశోక్‌బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు దారుణంగా వ్యవహరించిందని గుర్తు చేస్తూ.. టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా మసులు కోవాలని పిలుపునిచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు బలపరచిన అభ్యర్థులైన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని అశోక్‌బాబు గుర్తు చేశారు.