- సాంకేతికంగా బలోపేతం చేస్తాం
- వైసీపీ అరాచకాలను సరిదిద్దుతున్నాం
- జగన్ సూక్తులు గురివింద చందం
- డిఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోంమంత్రి
అనంతపురం (చైతన్య రథం): వైకాపా హయాంలో జరిగిన అరాచకాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. వైకాపా సైకో బ్యాచ్ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతుంటే.. జగన్ సూక్తులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌కు అనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమంతోపాటు వారికి మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులను సమాయత్తం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఏమీ జరగకపోయినా.. ఏదేదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను వైకాపా సైకోలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
‘‘గత ప్రభుత్వ హయాంలో జగన్ ఇంటి భద్రత కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారు. వైకాపా ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు వైకాపా దుష్టపాలన పాపాలే కారణం. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తాం. పోలీసులకు మౌలిక సదుపాయాలను కల్పించి, సాంకేతికంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తాం’’ అని అనిత స్పష్టం చేశారు.