- సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మార్గదర్శి
- మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు
అమరావతి (చైతన్యరథం): సాంకేతికపరమైన విప్లవానికి నాంది పలికి, నిరంతరం సంస్కరణల అభిలాషి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ది గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు తనను ఇంఛార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత ఇది మొదటి అభివృద్ధి కార్యక్రమమన్నారు. అందునా అభివృద్ధికి చిరునామాగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో చంద్రబాబుది మొదటి నుంచి ప్రత్యేకమైన ముద్ర అని మంత్రి అన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులు రాజకీయపరమైన ఆలోచనలే చేస్తారు..కానీ చంద్రబాబు రాజకీయాలకే పరిమితం కాకుండా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో నడిపే ప్రణాళికలు రూపొందించి, వాటికి సాంకేతికతను జోడిరచి, ఫలితాలు సాధించిన దార్శనికుడు అన్నారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తే అది గృహావసరాలకు, పారిశ్రామికాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడుతుందనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ విధమైన సంస్కరణలతో మొత్తం రాష్ట్రాభివృద్ధికి తొలి నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారని కొనియాడారు.
సరికొత్త మలుపు
రాజధాని ప్రాంతంలో ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం, ఇది ఇక్కడికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం మీద 18 ప్రాజెక్టులు.. వీటిలో 5 ప్రారంభోత్సవాలు, మిగతా 13 శంకుస్థాపనలు.. వెరసి రూ.5,407 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో సరికొత్త మలుపు అన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమే అయింది.. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోతే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, సహకరిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. పెన్షన్ల పెంపు, రైతులకు బకాయిల చెల్లింపు, నిరుద్యోగులు కలలుకంటున్న మెగా డీఎస్సీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు..ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అందరికీ మార్గదర్శకం
చంద్రబాబు మాటలు, చూపించే దారి మాకందరికీ మార్గదర్శకం అని మంత్రి దుర్గేష్ అన్నారు.. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా, అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు ఆయన ఎంతో తపన పడుతున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడిరదన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం భగవంతుడి ఆశీర్వాదమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు మద్దతుగా మనందరం నిలబడాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఇచ్చారు.