- వచ్చే ఏడాది ఘనంగా నిర్వహిద్దామన్న చంద్రబాబు
- సత్యసాయి ట్రస్ట్ ఆహ్వాన కమిటీకి మాటిచ్చిన ముఖ్యమంత్రి
- నవంబరు 23న సత్యసాయి 99వ జన్మదిన వేడుకలు
- ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్యమంత్రికి ఇన్విటేషన్
- మంత్రి లోకేష్‌నూ ఆహ్వానించిన సత్యసాయి కమిటీ
అమరావతి (చైతన్య రథం): పుట్టపర్తిలో నవంబర్ 23న జరిగే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున హాజరుకావాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి ప్రత్యేక ఛాంబర్‌లో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌తోపాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, పుట్టపర్తి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, వచ్చే 2025 నవంబర్ మాసంలో జరిగే సత్యసాయి శతాబ్ది జన్మదిన వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగలా గుర్తించి నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి పుట్టపర్తికి తప్పకుండా హాజరవుతానని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, మంత్రి సత్యకుమార్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అందుకు ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేసేలా జిల్లా యంత్రాంగంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సత్యసాయి ట్రస్టు సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ను కలిసి సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పలికారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున సత్యసాయి 100వ జన్మదిన వేడుకలు నిర్వహించేలా చూస్తానని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీకి హామీ ఇచ్చారు.