అమరావతి (చైతన్యరథం): ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మండలిలో శుక్రవారం లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కూర్పు విషయమై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపారు. లోకాయుక్త ఎంపిక కమిటీలో గతంలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, శాసనసభ స్పీకర్, హోంమంత్రి లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత, మండలి ఛైర్మన్ సభ్యులుగా ఉండేవారన్నారు. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందని తెలిపారు. ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టాం.
సాధారణంగా లోకాయుక్తకు హైకోర్టు రిటైర్డ్ సీజే గానీ, రిటైర్డ్ జడ్జి గానీ ఛైర్మన్‌గా ఉంటారు. ఉప లోకాయుక్తకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి ఛైర్మన్‌గా ఉంటారన్నారు. మండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేని కారణంగా ఆయనను మినహాయిస్తూ లోకాయుక్త ఎంపిక కమిటీలో ప్రతిపక్ష సభ్యుడిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. సవరణ బిల్లులో ప్రతిపక్ష నేత లేని సమయంలో అని మాత్రమే ఉంది. ప్రతిపక్ష నేతను మేం తీసివేయలేదు. మనం అందరం ప్రజాస్వామ్యంలో భాగస్వాములే.
మనం ఎక్కడ కూర్చోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. గతంలో మేం ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ప్రజల నిర్ణయం మేరకు ఇప్పుడు అధికారం చేపట్టాం. మాపై పవిత్ర బాధ్యత ఉంది. లోకాయుక్త స్ఫూర్తిని మేం ముందుకు తీసుకెళ్తాం. ఆ బాధ్యత మాది. పీఏసీ ఎన్నికలకు వైసీపీ నేతలు నామినేషన్ వేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ఛైర్మన్, సభ్యులు అనేది స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయిస్తారు. నామినేషన్ వేసిన వైసీపీ ఓటింగ్‌కు మాత్రం గైర్హాజరైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీకి రాని పరిస్థితి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.