- ఏడాదిలోగా హైకోర్టు బెంచి ఏర్పాటుకు ప్రజాప్రభుత్వం కృషి
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా యువగళం పాదయాత్రలో తాను మిషన్ రాయలసీమ పేరుతో డిక్లరేషన్ ప్రకటించానని, అందులో ప్రధానమైన హైకోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుపై న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ శాసనసభలో గురువారం ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… రాయలసీమ ప్రజల చిరకాల కోరిక అయిన హైకోర్టు బెంచిని ఏడాదిలోగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమ అభివృద్ధి జరిగింది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, పెట్టుబడులు టీడీపీ హయాంలోనే వచ్చాయి. తెలుగుగంగ నుంచి ఇతర సాగునీటి ప్రాజెక్టుల కోసం నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబునాయుడు వరకు పెద్దఎత్తున నిధులు కేటాయించి పూర్తిచేశారు.
2014-19నడుమ చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాంతానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చారు. అనంతపురానికి కియా మోటార్స్, అనుబంధ సంస్థలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి కల్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు, కడప కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తెచ్చాం. రాయలసీమలో ఐఐటి, ఐషర్, ట్రిపుల్ ఐటి వంటి ప్రఖాత విద్యాసంస్థలు తెచ్చాం. చంద్రబాబు రాయలసీమలో హార్టికల్చర్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలను ప్రోత్సహించారు. రాయలసీమలో సాగునీటి వనరులకు హార్టికల్చర్ జోడిస్తే పెద్దఎత్తున తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇందుకోసం మిషన్ రాయలసీమలో పలు హామీలు ఇచ్చాం, వాటిని సాకారం చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు.