- విజయవాడ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
- గతంలో 30 వేల మంది అదృశ్యమైనా నోరు మెదపని జగన్
- కూటమి ప్రభుత్వం వచ్చాక మార్పు మొదలైంది
- పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియాలో అసభ్యపోస్టులపై ఉక్కుపాదం
అమరావతి (చైతన్యరథం): మహిళల మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ పోలీసులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పవన్ పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ మరోసారి ధ్వజమెత్తారు. వారి అదృశ్యంపై జగన్ సర్కార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మొదలయిందన్నారు.
ఈ సందర్భంగా 18 మంది మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేసులు ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు, హోంమంత్రిత్వ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ అభినందనలు తెలియజేశారు. ఏపీ పోలీసులను చూసి తాను గర్వపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అన్నారు.
మహిళల భద్రత, వారి హక్కులు పరిరక్షించేందుకు పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పవన్ చెప్పారు. అలాగే మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖకు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.