- ప్రశ్నించినందుకు వేధింపులు
- నా భర్తపై చర్యలు తీసుకోవాలి
- తనఖా భూమిని స్వాధీనం చేసుకున్నారు, న్యాయం చేయండి
- మంత్రి నారా లోకేష్ 46వ రోజు ప్రజాదర్బార్‌కు విన్నపాల వెల్లువ
- సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు విన్నపాలు వెల్లువెత్తాయి. నెల రోజులకు పైగా విరామం తర్వాత ఉండవల్లిలోని నివాసంలో సోమవారం 46వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను ఆయా శాఖలకు పంపి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్ని…
కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టిన తమ 3.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అన్యాయం చేశారని తాడేపల్లికి చెందిన గరుకు కృష్ణకుమారి.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్త్రీధనం కింద నా తల్లిదండ్రులు చిలువూరులోని 3.10 ఎకరాల భూమిని రాసిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుల నిమిత్తం సదరు భూమిని ఇప్పటం గ్రామానికి చెందిన మున్నంగి మధుసూదన్ రెడ్డి వద్ద తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాం. కరోనా సమయంలో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేకపోయాం. ఇప్పుడు వడ్డీతో సహా రుణం చెల్లిస్తామని, భూమి పత్రాలు అప్పగించాలని కోరగా.. భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని మున్నంగి మధుసూదన్ రెడ్డి బెదిరిస్తున్నారని మంత్రి వద్ద కృష్ణకుమారి కన్నీటిపర్యంతమయ్యారు. భూమి విలువ పెరగడంతో అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమకు ఇంటి స్థలం మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ రోజా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఎన్నిమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో సాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తీసుకున్న అప్పునకు పొలం రాసివ్వాలంటూ పెదవడ్లపూడికి చెందిన అన్నే కృష్ణహర్ష, అన్నే కృష్ణ వినోద్‌లు వైసీపీ నేత దేవినేని అవినాష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని చినవడ్లపూడికి చెందిన వెనిగళ్ల వెంకట శివరావు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులతో వేధిస్తుండటంతో మానసిన వేదన అనుభవిస్తున్నామని, విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఉన్నత చదువులు చదివిన తమ పిల్లలకు ఉద్యోక అవకాశం కల్పించాలని తాడేపల్లికి చెందిన బెజ్జం రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
దివ్యాంగుడినైన తాను కుటుంబ పోషణ కోసం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని యర్రబాలెంకు చెందిన మండ్ర నాగేశ్వరరావు కోరారు. పరిశీలించి తగిన సాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయిన తన భర్త గత ప్రభుత్వ అండతో టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి దుర్భాషలాడారని, ప్రశ్నించిన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఏలూరు జిల్లా శ్రీరామవరానికి చెందిన కామిరెడ్డి జయశ్రీ ఫిర్యాదు చేశారు. వైసీపీ అండదండలతో నా భర్త కామిరెడ్డి వెంకట నర్సింహారావు కూటమి ప్రభుత్వంపైనా, టీడీపీ నేతలపైనా సోషల్ మీడియాలో నిత్యం అసభ్యపదజాలంతో దూషణలకు దిగుతున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచినందుకు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తమ వద్ద తీసుకున్న రుణం చెల్లించకుండా చంపుతామని బెదిరిస్తున్నారంటూ విజయవాడ కానూరుకు చెందిన ఆధ్యాత్మభట్టరు మాధవి.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 2016 ఏడాదిలో పెద్దముత్తేవి గ్రామంలో శ్రీకృష్ణాశ్రమం నిర్వాహకుడు ఎమ్.వి.ఎల్.ఎన్ సీతారాం, ఆయన కుమారుడు వాసుదేవ కృష్ణ చరణ్ మా వద్ద రూ.78 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇప్పటివరకు పూర్తి రుణం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి తగిన న్యాయం చేయడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అబ్బరాజుపాలెంలో వారసత్వంగా సంక్రమించిన తమ భూమిని ఇతరుల పేరుతో రాజధాని అమరావతికి భూసమీకరణ కింద ఇచ్చారని, విచారించి తగిన న్యాయం చేయాలని జమ్ముల శైలజ, వీరమాచినేని సుజన విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో తన 0.92 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేయాలని గరిమెళ్ల వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడినైన తాను అధికారుల తప్పిదంతో పాస్ బుక్ కోసం గత పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మీ-సేవ ఆపరేటర్లను తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు.. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ సేవల్లో మీ-సేవ ఆపరేటర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు
విజయవాడలో నోట్ బుక్స్ తయారీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఈ పరిశ్రమపై ఆధారపడ్డ పదివేల కుటుంబాలను తగిన విధంగా ఆదుకోవాలని విజయవాడ బుక్ బైండిరగ్ లేబర్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.