- శక్తివంచన లేకుండా ప్రయత్నించా.. బతికించుకోలేకపోయా
- బాధగా ఉంది.. ఐ మిస్‌యూ..
- ఇక నీ అన్నగా కుటుంబ బాధ్యత మోస్తా
- వీరాభిమాని ఆత్మహత్యపై మంత్రి లోకేష్ తీవ్ర ఆవేదన
- తొందరపాటు నిర్ణయాలు వద్దని కార్యకర్తలకు హితవు
- బతికే ఉందాం..మరికొందరిని బతికించుకుందామని ఉద్బోధ
అమరావతి (చైతన్యరథం): అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండుగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడూ.. ఐ మిస్ యూ!
తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భావోద్వేగంతో ఎక్స్‌లో తన మనోవేదన వ్యక్తం చేశారు.
ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి యత్నించిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీనూ..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు.. కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇదే నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరో ఒకరితో షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికే ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు.
అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీను వ్యక్తిగత కారణాలతో శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మంత్రి నారా లోకేష్‌కు శ్రీను వీరాభిమాని. అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలియగానే మెరుగైన చికిత్స అందించాలని లోకేష్ ఆదేశించటంతో శ్రీనును తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీను మృతిచెందాడు. దీంతో లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.