- ఆదర్శ గ్రామంగా నేమకల్లు అభివృద్ధి
- నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి నీరు
- ఎడారీకరణ అడ్డుకుంటాం
- పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం
- పీఎం సూర్యఘర్ కింద ఉచితంగా సోలార్ ప్యానల్స్ అందిస్తాం
- జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తిచేస్తాం
అనంతపురం (చైతన్యరథం): అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో శనివారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గ్రామంలో 112 మందికి ఇండ్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తాం. ఇంటింటికి కుళాయిలను వేసి సురక్షితమైన మంచినీరు ఇస్తాం. ప్రస్తుతం పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇంట్లోనే కరెంటును తయారు చేసుకునే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తులో మీ వాడకానికి పోను మిగిలినది గ్రిడ్‌కు ఇచ్చే అవకాశం ఉంటుంది. గ్రామంలో 759 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మీకందరికీ ఉచితంగా సోలార్ ప్యానళ్లు పెట్టించే ఏర్పాటు చేస్తాం. ఇందు కోసం రెస్కో కింద సంస్థను ఏర్పాటు చేసి రుణాలు అందిస్తాం. ఊరంతా సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు ఉండాలి. ఎక్కడా అపరిశుభ్రత ఉండకూడదు. చెత్తను కాంపోస్టుగా తయారు చేయాలి. మరలా మీ గ్రామానికి తనిఖీకి వస్తా. ఈ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటా. మినీ గోకులాలు ఎన్ని కావాలన్నా మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎడారీకరణ అడ్డుకుంటాం
ఈ ప్రాంతంలో జీడిపల్లి – బైరవానితిప్ప ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని పూర్తి చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం. నేమకల్లు – గుంతకల్లు మధ్య అయిదు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను మంజూరు చేస్తున్నాం. దాని ద్వారా ఈ ప్రాంత పరిసర గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. హంద్రీనీవా 36 ప్యాకేజీలో మాల్యం- అవలదట్ల మధ్య తలపెట్టిన బ్రాంచ్ కాలువను పటిష్టం చేస్తాం. రాయదుర్గం మున్సిపాలిటీ ఇబ్బందుల్లో ఉందని చెప్పారని, ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకుంటాం. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం. బొమ్మనహాల్‌లో 25,000 ఎకరాల్లో ఇసుక మేటలు, దిబ్బలు ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం అర కిలోమీటర్ పెరుగున్నాయి. ఇసుక మేటలు, దిబ్బలు పెరగకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటాం. వేదవతి `హగరిలో సబ్ సర్ఫేస్లు కావాలని అడిగారు. ఏర్పాటు చేస్తాం,. డి.హీరేహాల్లో పర్కులేషన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం. నేమకల్లు- డి.హీరేహల్ మధ్యలో ఒక పారిశ్రామిక కస్టర్ ఏర్పాటు చేస్తాం. బొమ్మనహల్ మండలం శ్రీధరగట్ట గ్రామానికి తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రతి నియోజకవర్గంలో అక్కడి ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని 100 ఎకరాల నుంచి వేల ఎకరాల్లో పరిశ్రమలు తెచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది. అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని సాకారం చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాం. నేమకల్లు ఆంజనేయ స్వామి గోపురానికి సిజిఎఫ్ కింద రూ.3 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. పిల్లలు బాగా చదువు కుంటున్నారని ఈ ప్రాంతానికి బిసి రెసిడెన్షియల్ పాఠశాల కావాలని కోరారు. దానిని కూడా మంజూరు చేస్తున్నాం. ఈ గ్రామంలో 98 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి, దానిని పూర్తిగా 100 శాతం చేయాలి. జిపిఎస్ మ్యాపింగ్ చేశాం.. కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తాం. మీ ఇంటికే పౌర సేవలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. సంపద సృష్టించి ఆ సంపదను పేద వాళ్లకు అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఆదర్శ గ్రామంగా నేమకల్లు
శ్రావణమాసం శనివారాల్లో ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మూడు ఆంజనేయస్వామి ఆలయాలు… మురడి, నేమకల్లు, కసాపురం ల్లోని ఆలయాలను సమన్వయం చేస్తూ ఒకే రోజు దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, అది కొనసాగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మీ ఆశయాలు నెరవేర్చడానికి అనునిత్యం పనిచేస్తాం. మీలో కూడా చైతన్యం రావాలి. టెక్నాలజీని తీసుకొస్తాం… దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. నేమకల్లును ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి ప్రతిపాదన రూపొందించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నా. గ్రామంలో అభివృద్ధిపై ప్రతి సంవత్సరం సమీక్షిస్తా. నేను చూసిన గ్రామాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేస్తా. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతగా మీ అభివృద్ధికి దోహదపడేలా కష్టపడతానని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు.. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి కలిసి ఉన్న చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ లబ్ధిదారురాలు భాగ్యమ్మ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి రెండు లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.