- ‘ఫెంగల్’ పరిస్థితిపై సీపం చంద్రబాబు సమీక్ష
- తాజా పరిస్థితులను నివేదించిన అధికారులు
- ఎన్యూమరేషన్ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి
- వర్షాలు తగ్గేవరకూ అప్రమత్తం: సీఎం ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): ఫెంగల్ తుఫాను ప్రభావం, ప్రభుత్వ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో గత 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31ఎంఎం వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో తిరుపతి జిల్లాలో 178 ఎ.ఎం, చిత్తూరు జిల్లాలో 93 ఎం.ఎం, నెల్లూరు జిల్లాల్లో 88 ఎంఎం, అన్నమయ్య జిల్లాలో 65 ఎం.ఎం వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. మొత్తం 53 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని.. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్లమేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని.. దీనికి అవసరమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చెయ్యాలని సీఎం సూచించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.