అమరావతి (చైతన్య రథం): ప్రజా సమస్యలపై ఆందోళనలకు జగన్ పిలుపునివ్వడం హాస్యాస్పదమని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన బదిలీ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఖజానాను ఖాళీచేసిన జగన్.. అధికారం లేకుండా ఉండలేక పోతున్నట్లుందని వ్యాఖ్యానించారు. అరాచక పాలనను కొద్దినెలల క్రితమే ప్రజలు తిరస్కరించారని.. ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని యనమల హితవు పలికారు. వైకాపా ప్రభుత్వంలో పడిన అష్టకష్టాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని యనమల అన్నారు. వైకాపా ఆందోళనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో చెన్నారెడ్డి పాలనలో ఇలాగే చేసిన అనుభవం వైఎస్‌ఆర్ కుటుంబానికి ఉందని గుర్తుచేశారు. జగన్ కేసుల విచారణలో వేగం పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్ హయాంలో సెజ్ పేరుతో చిన్న, మధ్య తరహా రైతుల భూములను తీసుకున్న కేవీరావుపైనా కేసు నమోదు చేయాలని యనమల అన్నారు.