- తొలిసారి మంత్రి హోదాలో పరిశ్రమ సందర్శన
- కియా అభివృద్ధికి సహకరిస్తాం: మంత్రి సవితమ్మ
పుట్టపర్తి (చైతన్యరథం): కియా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర కార్మిక పరిశ్రమలు, బాయిలర్స్ ఇన్సూరెన్స్, ఆరోగ్య సంరక్షణ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తొలిసారి కార్మిక శాఖ మంత్రిగా పెనుగొండ ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం జౌళి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి సవితమ్మతో కలిసి గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులకు కియా యాజమాన్య ప్రతినిధులు సీఈవో కబ్ డాంగ్లీ, హెచ్‌ఓడిలు హాన్, మా , శాంగ్ జే డాక్టర్ పాటిల్, డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం పీఆర్‌ఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో కియా పరిశ్రమ ద్వారా చేపట్టిన అభివృద్ధి సి.ఎస్.ఆర్. పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంత్రులు వీక్షించారు. తర్వాత కియా సేఫ్టీ అధికారి రియాజ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఫైర్ మాక్‌డ్రిల్ గ్యాస్ లీకేజీ డెమోను కార్మిక మంత్రి తిలకించారు. ఇందులో భాగంగా పరిశ్రమలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన భద్రత చర్యలను ఆధునిక సాధనాల ద్వారా డెమో ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కరువు ప్రాంతంలో కియా పరిశ్రమ స్థాపన ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కియా పరిశ్రమ స్థాపనకు ఎంతగానో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం కియా పరిశ్రమ, అనుబంధ సంస్థలో సుమారు 20వేలమంది దాకా ఉపాధి పొందడం ఎంతో హర్షణీయమన్నారు. కార్మిక శాఖ మంత్రిగా తాను తొలిసారిగా కియా పరిశ్రమను సందర్శించడం తనకెంతో చక్కటి అనుభూతి కలిగించిందన్నారు. ఇతర పరిశ్రమలకు కియా ఎంతో ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. కియా యాజమాన్యం కూడా నూతన సాంకేతిక ప్రమాణాలతో కార్లను ఉత్పత్తి చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పలు పరిశ్రమల్లో భద్రత లోపాల కారణంగా 34 మంది మరణించారన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావతం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వసుధా మిశ్రా కమిటీ ఏర్పాటు జరిగిందని మంత్రి తెలిపారు. తద్వారా పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలపై భద్రత లోపాల పై వాస్తవ లను నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కియా పరిశ్రమలో భద్రత సదుపాయాలు ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. వసుధా మిశ్రా కమిటీ కూడా కియాను సందర్శించి ఆధునిక భద్రత ఏర్పాట్ల చర్యలు గురించి నివేదికలో పొందుపరచి కార్యాచరణ రూపోందిస్తామన్నారు. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈఎస్‌ఐకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు రూ . 610 కోట్లు నిధులను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక పోయిందని మంత్రి వెల్లడిరచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కియా పరిశ్రమలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా కియా యాజమాన్యాన్ని మంత్రి కోరారు. సుమారు 3 గంటలకు పైగా కియా పరిశ్రమలో మంత్రి కలియ తిరిగి వివిధ విభాగాలను పరిశీలించారు.
అంతకుముందు మంత్రి సవితమ్మ మాట్లాడుతూ కియా అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్య సాయి జిల్లాకు కియా పరిశ్రమ స్థాపన ద్వారా గుర్తింపు లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లనే ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కియా ట్రైనింగ్ సెంటర్‌లో మరింతగా యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి యాజమాన్యానికి సూచించారు. కియా పరిశ్రమ రాష్ట్రంలోనే దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. పరిశ్రమను అన్ని విధాల ప్రభుత్వం ద్వారా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. సీిఎస్‌ఆర్ పనులకు సంబంధించి ప్రజలకు అవసరమైన మేరకు జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మంత్రి సవిత తెలిపారు. కార్య క్రమంలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, లేబర్ డిప్యూటీ కమిషనర్ లక్ష్మినరసయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.