- ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- సమగ్ర నివేదిక వచ్చాక సినీ పెద్దలతోనూ భేటీ
- సినిమా టికెట్ల రేట్ల పెంపుపై అధ్యయనం
- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్‌లోని తన చాంబర్లో సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పాలసీల మాదిరిగానే ఫిల్మ్ పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే సినిమా రంగానికి సంబంధించిన వారితో సమావేశం నిర్వహిం చాలన్న అంశం ప్రస్తావనకు తీసుకురాగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించా రు. సమగ్ర నివేదిక రూపొందించాక సినీ పరిశ్రమ పెద్దలతో భేటీ అయి చర్చిద్దామ న్నారు. ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అడిగి తెలు సుకున్నారు.
దీర్ఘకాలికంగా ఒక విధానం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిణామ క్రమాన్ని, చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన అంశాన్ని మంత్రి అధికా రులకు వివరించారు. రాష్ట్రంలో తెలుగుచలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏపీలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్, రీ రికార్డింగ్ థియేరట్ల ఏర్పాటు అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగా మంత్రి సావధానంగా విన్నారు. రాష్ట్రంలో తెలుగుచలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, హెం శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హిమాన్షుశుక్లా, ఎఫ్డీసీ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎల్.ఎన్.శేషసాయి తదితరులు పాల్గొన్నారు.