- పనుల పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
- వెనుకబడ్డ అధికారులపై చర్యలుంటాయని స్పష్టీకరణ
- వారాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచన
అమరావతి (చైతన్యరథం): సంక్రాంతి పండుగ నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రహదారుల మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేరకు ఒక నెల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్దిష్ట కాలవ్యవధిలో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగాలని సూచించారు. విజయవాడలోని ఈఎన్‌సీ కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. గత 5 ఏళ్ల పాటు పాడైన రహదారులపై ప్రయాణించలేక నరకయాతన అనుభవించిన ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో.. రోడ్ల మరమ్మత్తు పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజు వారీ ప్రగతి వివరాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. మొత్తంగా రూ. 861 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి 2,468 కి.మీ మేర రోడ్లను ఇప్పటికి గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రోడ్ల ప్రగతిపై ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ఆరా తీస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత నిబద్ధతతో పనిచేస్తేనే సకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్నారు. కొన్ని జిల్లాల్లో రోడ్ల మరమ్మతుల పనులు వెనుకబడి ఉండటంపై సంబంధిత డివిజన్ అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.
వారాల వారీ లక్ష్యాలు..
ఇటీవల కాలంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ఇకపై ఆయా ప్రాంతాల్లోనూ మరింత ముమ్మరంగా పనులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత డివిజన్ల అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో పనులను వేగవంతం చేసే విధంగా ముందుకు సాగాలన్నారు. ఇకపై రోడ్ల మరమ్మతుల పనులకు వారం రోజులకు ఒకసారి లక్ష్యం నిర్ధారించుకుని అందుకనుగుణంగా పనిచేయాలన్నారు. మంగళవారం మరొకసారి వారాల వారీ ప్రణాళికలు – టార్గెట్‌కు సంబంధించి సమీక్ష చేస్తానని, అధికారులందరూ అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఏ వారంలో ఎన్ని కి.మీ పనులు చేయాగలరో లక్ష్యం నిర్దేశించుకుని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నూతన సంవత్సరంలో రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి ఎటువంటి విమర్శలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పనితీరు ఉండాలని మంత్రి జనార్ధన్ రెడ్డి సూచించారు.
అర్జీలకు త్వరితగతిన పరిష్కారం
రోడ్లకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండిరగ్‌లో ఉంచడం సరికాదని, ఈ విషయంలో అలసత్వం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా మిషన్ మోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని, అదే సమయంలో రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రోజువారీ రోడ్ల పనుల ప్రగతికి సంబంధించి అప్‌డేట్స్ అందిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్‌సీ నయీముల్లా, శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.