- గత పాపాలు బయటపడుతున్నాయనే పిచ్చి ప్రేలాపనలు
- విజయవాడ సబ్‌జైలు అధికారుల తీరుపై విచారణ జరుగుతోంది
- తప్పు చేశారని తేలితే చర్యలు తప్పవు
- హోం మంత్రి అనిత స్పష్టీకరణ
విజయవాడ (చైతన్యరథం): అధికారులు విధులు మరిచి రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విజయవాడలోని సబ్‌జైల్‌ను సోమవారం హోం మంత్రి అనిత పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జైలులో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్వయంగా వచ్చామని, మౌలిక వసతులపై ఆరా తీశామని తెలిపారు. జైలులో కొందరు అధికారుల తీరుపై వస్తున్న ఆరోపణల గురించి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. ఖైదీని ఖైదీలా..ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా నిఘా ఉంటుంది.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని విమర్శించారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరింపులకు గురిచేశారన్నారని హోం మంత్రి అనిత విమర్శించారు.
తప్పు చేయకపోతే భయమెందుకు?
గతంలో అధికారంలో ఉండగా చేసిన తప్పులు బయటపడుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా.. బురద జల్లినా.. పవన్ కల్యాణ్‌కు.. తమకు మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించినా.. ఏం చేసినా.. ఆయనను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. విజయసాయి రెడ్డి ఎంతమంది వద్దకు వెళ్లి ఎన్ని రకాలుగా మాట్లాడినా, తన గురించి విమర్శలు చేసినా భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆస్తులు కొల్లగొట్టారని.. ఈ అంశాలపై విచారణ జరుగుతోందని అన్నారు. ఏ తప్పు చేయకపోతే విజయసాయి రెడ్డికి భయమెందుకు.. ధైర్యంగా ముందుకొచ్చి విచారణ చేసుకోమని చెప్పాలన్నారు. అవన్నీ వదిలేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అనిత మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. అవన్నీ వదిలేసి విషయాన్ని పక్కదారి పట్టించేలా మీడియా ముందు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని హోమంత్రి అనిత జోస్యం చెప్పారు.
రేషన్ మాఫియాపై విచారణ జరుగుతోంది
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరుగుతోందని.. నిందితులను వదిలి పెట్టేదిలేదని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలపై ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని, పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని.. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.