- జగన్‌పై మండిపడ్డ మంత్రి అనగాని
- విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి
- అడ్డుకునేందుకు అబద్ధాలతో జగన్ తప్పుడు ప్రచారం
- వైఖరి మారకపోతే జీరో రెడ్డిగా మారటం ఖాయం
అమరావతి: వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని మోపి విద్యా వ్యవస్థను నాశనం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ కంటే మహానటులు ఎవరూ లేరని ధ్వజమెత్తారు. పదే పదే అబద్ధాలు చెప్పడంతోపాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి కూడా ప్రజా రక్షకుడిగా చెప్పుకోవడం ఆయనకే సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి.. ఇప్పుడేమో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం ఘోరంగా పడిపోయిందని దుయ్యబట్టారు. భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ మార్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్నారని మండిపడ్డారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువనేత, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడి బాగు చేస్తుంటే చూసి సహించలేక తప్పుడు ప్రచారాలతో జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకకైనా నటించడం ఆపి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు. లేకుంటే ఇప్పటికే లెవెన్ రెడ్డిగా ఉన్న జగన్.. పెద్ద జీరో రెడ్డిగా మారిపోతాడని హెచ్చరించారు.