- 2026 అక్టోబరుకు ప్రాజెక్టు పూర్తే లక్ష్యం
- అందుకు దశలవారీ లక్ష్యాల కార్యాచరణ
- టైమ్‌లైన్‌కు ముందే పనులు పూర్తిచేసేలా చర్యలు
- 2025 ఏప్రిల్ నాటికి 400 ఎకరాల భూసేకరణ లక్ష్యం
- అందుకు, సమర్థ అధికారికి ప్రత్యేక బాధ్యతలు
- ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి
- పోలవరం.. ఏపీకి జీవనాడి అంటూ వ్యాఖ్య
ఏలూరు/ పోలవరం (చైతన్య రథం): పోలవరం ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితులలోనూ 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడిరచారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అన్నారు. ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో చర్చించామని, ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు దశలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని 2026 అక్టోబర్‌కు పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసిఆర్‌ఎఫ్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారన్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను జనవరి 2న చేపట్టనున్నామని, అందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు 2026 మార్చికి పూర్తిచేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారని, కానీ 2025 డిసెంబర్‌కు పూర్తి చేయాలని కోరుతూ లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఈసిఆర్‌ఎఫ్ గ్యాప్ `1 పనులు ఫిబ్రవరి 2026నాటికి, గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు. కానీ, అంతకంటే ముందుగానే పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను కోరుతూ లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ప్రాజెక్ట్ సివిల్ పనులను 2026 మే, జూన్ నాటికి పూర్తిచేస్తే ఒక సీజన్‌ను కోల్పోకుండా ఉంటామని, 2026 నుండి ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను కోరామన్నారు. ప్రాజెక్ట్ కుడికాల్వ, ఎడమ కాల్వ కనెక్టివిటీ పనులు 2026 జూన్‌లోగా పూర్తి చేయాలనీ, స్పిల్ ఛానల్ పనులు 2026 జూన్‌నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులను త్వరితగతిన తీసుకువచ్చేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.
2014 నుండి 2019 తమ ప్రభుత్వ కాలంలో 72 శాతం పనులు పూర్తి చేశామని, గత ప్రభుత్వం కేవలం 3.84 శాతం మాత్రమే పనులు పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులో రూ.2400 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి తెలియజేసి, మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు నిర్మాణానికి రూ.12వేల 157 కోట్లు సాధించామన్నారు. వాటిలో రూ.2345 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 7 లక్షల 27 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుతో పాటు, మరో 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌తో పాటు, విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, ప్రజలకు త్రాగునీటికీ 23టీఎంసి నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. నదులు అనుసంధానంలో భాగంగా ఇప్పటికే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని అందించామన్నారు.
అదేవిధంగా కృష్ణానది నుంచి నాగార్జునసాగర్ కుడి మెయిన్ కెనాలకు, గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద బనకచర్లకు నీటిని అందించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి వంశధార ప్రాజెక్టుకు అవసరమైన అన్ని కార్యాచరణ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామన్నారు. పోలవరం.. వంశధార ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కరవురహిత జిల్లాలుగా రూపొందుతాయన్నారు. 2014 -19 ప్రాజెక్టు అభివృద్ధి కొరకు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశానని, ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో 28సార్లు పరిశీలించి, 82సార్లు వర్చువల్‌గా సమీక్షించామన్నారు. అప్పర్, లోయర్ డాం గ్యాప్ `1, గ్యాప్ `2లోకి గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి 200 మీటర్లు దెబ్బతిన్నదన్నారు. దీనివల్ల రూ.2400 కోట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. అప్పట్లో రు.440 కోట్లతో పూర్తిచేస్తే, ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. సాండ్ ఫిల్లింగ్‌కి రు.350 కోట్లు అవుతుందన్నారు. దీనివలన రూ.2400 కోట్ల అదనపు ఖర్చు తేలిందన్నారు.
గతంలో రు.8242 కోట్ల నిధుల వస్తే.. జగన్ సర్కారు రూ.2342 కోట్ల నిధులను మళ్లించిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79 శాతం పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై నిపుణులతో 2 రోజులు వర్క్‌షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొద్దిగా పూర్తి కావాల్సి ఉందని, తరవాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌ను మార్చివేయడంతో సకాలంలో పనులు పూర్తికాక, 2020లో వచ్చిన అతి పెద్ద వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు.మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఎమ్మెల్యేలు చిర్రీ బాలరాజు, కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, బడేటి రాధాక్రిష్ణయ్య, (చంటి), బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభృతులు పాల్గొన్నారు.