- మంత్రి నారా లోకేష్ యోచన
- రియల్ టైమ్‌లో రోగుల ట్రాకింగ్, పర్యవేక్షణ, నిరంతర సంరక్షణ
- మరింత మెరుగ్గా రోగులకు చికిత్స
- కోలార్‌లోని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి బృందం
కోలార్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థల్లో అత్యాధునిక విధానాలను ప్రవేశపెట్టి వైద్య సేవలను మెరుగుపరచటమే ధ్యేయంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సోమవారం కర్ణాటకలోని కోలార్‌లో ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్‌పై ఏర్పాటైన టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ (డిఐఎన్‌సి)ని సందర్శించింది. వైద్య సేవల్లో డిఐఎన్‌సి తీసుకువచ్చిన విప్లవాత్మక విధానాలను తెలుసుకుంది. ఈ బృందంలో ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సీఎం సాయికాంత్ వర్మ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి వినూత్నమైన, ఆరోగ్య సంరక్షణ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్న మంత్రి లోకేష్.. ఈ రంగంలో ఇప్పటికే విజయం సాధించిన కోలార్ డిఐఎన్‌సిని సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న విధానాలను ఏపీలోనూ అమలు చేసి రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మంత్రి లోకేష్ యోచిస్తున్నారు.
సమగ్ర ఆరోగ్య సేవల్లో డిఐఎన్‌సీ తీసుకువచ్చిన అత్యాధునిక విధానాలను, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలపై వాటి ప్రభావం గురించి మంత్రి లోకేష్ బృందానికి టాటాఎండీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గిరీష్ కృష్ణమూర్తి వివరించారు. దీనిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రి లోకేష్ బృందానికి చూపించి, వాటి గురించి వివరంగా తెలియజేశారు. పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్యం, నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల (ఎన్‌సీడీ) నిర్వహణ, మానసిక ఆరోగ్య కేసుల చికిత్సలో డిఐఎన్‌సీ ద్వారా అమలు చేస్తున్న అత్యాధునిక విధానాల గురించి వివరించారు. డిఐఎన్‌సీ ద్వారా రియల్ టైంలో రోగుల ట్రాకింగ్, పర్యవేక్షణ, నిరంతర సంరక్షణ, సమన్వయం, మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. హై`రిస్క్ గర్భాలు, ఎన్‌సీడీలు, మానసిక ఆరోగ్య కేసుల చికిత్సలో డిఐఎన్‌సీ ప్రభావాన్ని, ఆరోగ్య సేవలను అందించటంలో డిఐఎన్‌సీ సామర్థ్యాన్ని వివరించారు.
అనంతరం నారా లోకేష్ బృందం వేమ్‌గల్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం (పీహెచ్‌సీ)లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. డిఐఎన్‌సి ద్వారా ఓపీ విధానం, రిఫరల్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు. ఇక్కడ అమలు చేస్తున్న సరికొత్త విధానాలతో తల్లి ఆరోగ్య సంరక్షణ, ప్రసవానంతర చికిత్స, గర్భిణుల కోసం లామేజ్ సెషన్‌ల వంటి వినూత్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. తరువాత శెట్టిహళ్లిలోని హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల మధ్య సమన్వయం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జరుగుతుండటాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అక్కడ పనిచేస్తున్న ఆషాలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అత్యాధునిక డిజిటల్ పరికరాలు వాడుతుండటం, సబ్ సెంటర్లలో డాక్టర్ సంప్రదింపులు, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లు, ఇమ్యునైజేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌లో అత్యాధునిక విధానాలు అమలవుతున్న విషయం తెలుసుకున్నారు.