- మరమ్మతు పనులను ముమ్మరం చేయాలి
- సంక్రాంతినాటికి పనులు పూర్తి కావాలి
- అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం
- పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతు పనులను పూర్తి చేసి, గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాల్సిందేనని ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అనుకున్న విధంగా గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం నెల రోజుల సమయమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతు పనులను మరింత ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట కాల పరిమితిని పెట్టుకుని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని, ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేసే విధంగా ముందుకుసాగాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈఎన్‌సీ నయిముల్లా, ఏపీఎస్ ఆర్డీసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజు వారీ ప్రగతి నివేదికలపై ఆయా డివిజన్ల అధికారులతో మంత్రి మాట్లాడారు. కొత్త ఏడాదిలో ప్రజలకు మంచి రోడ్లు అందించాలనే ఆలోచనతో జనవరి తొలి వారం నాటికే పనులు పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల నుంచి రోడ్లకు సంబంధించి ఏ విధమైన విమర్శలకు తావులేకుండా పనిచేయాలన్నారు. వివిధ కారణాలతో వెనుకబడ్డ డివిజన్లకు సంబంధించి ఆ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడాలన్నారు. ఎప్పటిలోపు పనులు పూర్తి చేస్తారో టార్గెట్ ఫిక్స్ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఇప్పుడు వెనుకబడ్డ డివిజన్‌లు వచ్చే సమావేశం నాటికి పనుల్లో వేగం పుంజుకోవాలన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 45,378 కి.మీ మేర రాష్ట్ర, జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా, అందులో 22,299 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా రూ. 861 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇప్పటి వరకు 4,157 కి.మీ మేర రోడ్లను గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దామన్నారు. ముఖ్యమంత్రితో పాటు తామంతా రోడ్ల ప్రగతిపై ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించడం ద్వారా రోడ్ల మరమ్మతులను తాను స్వయంగా పర్యవేక్షించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల పనుల విషయంలో సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సైతం మరింత కష్టపడి పనిచేయాలన్నారు. రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించిన సమయంతో పోలిస్తే, వర్షాలు వంటి కారణాలతో కొన్ని డివిజన్‌లలో పనులు ముందకొడిగా సాగుతున్నాయన్నారు.
ఆయా డివిజన్లలో పనులు తిరిగి వేగం పుంజుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పని చేయాలన్నారు. అదే సమయంలో ఆయా పనులును సకాలంలో పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లపై కూడా ఒత్తిడి పెంచాలన్నారు.. సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి జాప్యం లేకుండా త్వరితగతిన బిల్లులు అందజేస్తామని మంత్రి తెలిపారు. గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా మిషన్ మోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని, అదే సమయంలో రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎంత మాత్రం రాజీపడవద్దని మంత్రి స్పష్టం చేశారు. రోజు వారీ రోడ్ల పనుల ప్రగతికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే ఆయా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమన్వయం చేసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు మంత్రి సూచించారు.