- పేర్ని జయసుధ గోదాములో మొత్తం 4840 బస్తాలు మాయం
- మూడు శాఖలతో లోతుగా విచారణ
- తప్పు చేసినవారు తప్పించుకోలేరు
- సాక్ష్యాధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబెడతాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ
తెనాలి (చైతన్యరథం): వైసీపీ నాయకుడు, మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు.. క్రిమినల్ కేసులు నమోదు చేశాం.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆ గోడౌన్‌లో 3 వేల బస్తాలు కాదు… మొత్తం 4840 బస్తాలు మాయం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి… దానిని దుర్వినియోగం చేసిన తీరును సాక్ష్యాధారాలతో ప్రజల ముందుపెడతామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. అక్కడే ఉన్న రెండో గోదాముపైన కూడా అనుమానాలు ఉన్నాయన్నారు.
సాఫ్ట్‌వేర్ అమలు చేస్తున్నామనగానే లేఖ రాశారు
పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకురావాలని నవంబర్ 26న సివిల్ సప్లైస్ ఎండీ.. ‘‘వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్’’ అనే సాఫ్ట్ వేర్ తీసుకొచ్చారు. ఏ గోడౌన్‌లో ఎంత స్టాక్ ఉంది? ఏ గోడౌన్‌లో ఎంత స్టాక్ భద్రపరచాలి? వచ్చే సీజన్‌లో ఎంత వరకు ధాన్యం కొనుగోలు చేయాలి.. ఇలాంటి సమాచారం పొందుపరిచే విధంగా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. అదే రోజు గోడౌన్ యాజమానులకు, మేనేజర్లకు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆన్ లైన్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా తనిఖీలు చేసి ఆన్ లైన్‌లో నమోదు చేయాలో వివరంగా తెలియజేశారు. ఆ మరుసటి రోజునే.. నవంబర్ 27వ తేదీన తమ గోదాముల్లో నిల్వలు తగ్గాయని, మూడు వేల బస్తాల రేషన్ బియ్యం తక్కువగా కనబడుతోందని, వేబ్రిడ్జ్ లో తూకం పొరపాటు వల్ల ఇలా జరిగిందని జె.ఎస్. గోడౌన్ ప్రతినిధులు లేఖ రాశారు. గోడౌన్‌లో మాయమైన బియ్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.
ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం
ఆ లేఖ చూడగానే… అసలు జేఎస్ గోడౌన్స్‌లో స్టాక్ ఎంతుందనే సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ నుంచి డిసెంబర్ 4వ తేదీన తెప్పించుకున్నాం. దీంతో చట్టప్రకారం తగ్గిన బియ్యం విలువకు రెట్టింపు మొత్తం జరిమానా వేయాలని, జేఎస్ గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిసెంబర్ 10న సివిల్ సప్లయిస్ ఎండీ ఫిర్యాదు చేశారు. మాయమైన రేషన్ బియ్యంపై లోతైన విచారణకు ఆర్డీవో, సివిల్ సప్లయిస్ మేనేజర్, లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్‌తో కమిటీ వేశారు. జేఎస్ గోడౌన్‌లో డిసెంబర్ 16వ తేదీన తనిఖీలు నిర్వహిస్తామని 13వ తేదీన నోటీసులు జారీ చేశాం. నోటీసులు జారీ చేసిన రోజే కోటి రూపాయల డీడీలను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు జరిమానా కింద జేఎస్ యాజమాన్యం అందించింది. 16వ తేదీన సిబ్బంది తనిఖీలకు వెళ్లినా సహకరించలేదు. కనీసం ఎవరూ రాకపోవడంతో- పై అధికారుల అనుమతితో లాయర్ల సమక్షంలో పంచనామా చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరపడానికి అక్కడ ఉన్న స్టాక్ 4093 బస్తాలు మండల లెవల్ స్టాకింగ్ పాయింట్లకు తరలించారు. దీన్ని మొత్తం వీడియో కెమెరా ద్వారా చిత్రీకరించామని మంత్రి నాదెండ్ల వివరించారు.
రిజిస్టర్ ట్యాంపర్ చేసే ప్రయత్నం
వేబ్రిడ్జ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పొరపాటున స్టాక్ తగ్గింది అని జేఎస్ యాజమాన్యం చెబుతోంది. అయితే పక్కనే ఉన్న సత్య గోడౌన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందనిగానీ, స్టాక్ తగ్గిందని మాత్రం చెప్పలేదు. స్టాక్ రిజిస్టర్, లారీ వేబ్రిడ్జ్‌ను ట్యాంపర్ చేసి ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదయింది. అందిన రిపోర్టు ప్రకారం 243 మెట్రిక్ టన్నులు అంటే 4840 బస్తాలు తగ్గాయని నిర్ధారణ అయింది. నిబంధనల ప్రకారం 2 కోట్ల 23లక్షల 56వేల రూపాయలు చెల్లించారు. చాలా మంది సంబంధిత గోడౌన్ యజమాని కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. తప్పు చేస్తే ఎవరూ తప్పించుకోలేదు. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావాల్సిందే. జేఎస్ గోడౌన్ 2021లో పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. అక్కడ సుమారు 5వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని భద్రపరుస్తాం. అటువంటి గోడౌన్‌లో 243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దారి మళ్లించారు. లెక్కలతో సబంధం లేకుండా ప్రజల సొమ్ము స్వలాభం కోసం దారి మళ్లించారు. కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు హామీ ఇస్తున్నాం. వందకు వందశాతం న్యాయం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.