- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళగిరి శాలువా బహూకరణ
- మంత్రి లోకేష్ బాటలోనే భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి
అమరావతి (చైతన్యరథం): మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.. చేనేతలు తమ ఆత్మబంధువులని చెప్పే మంత్రి నారా లోకేష్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా అభిమానాన్ని చూపుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మంగళగిరి చేనేతలకు మంత్రి నారా లోకేష్‌తోపాటు ఆయన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ మంగళగిరి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్‌లో మంగళవారం జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేతలు నేసిన శాలువాను ఆమెకు మంత్రి బహూకరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులను కలిసినపుడు కూడా మంగళగిరి శాలువాలతోనే వారిని మంత్రి లోకేష్ సత్కరించారు. లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మంగళగిరి చీరలను ధరిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలావుండగా ప్రతిపక్షంలో ఉండగానే మంత్రి లోకేష్ మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటుచేసి, ఇక్కడి చేనేతలు తయారుచేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టనేరియాతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతనావస్థకు చేరుతున్న మంగళగిరి చేనేతను పునరుజ్జీవింప జేసేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషికి మంగళగిరిలోని చేనేతలు మురిసిపోతున్నారు.