- క్రీడాకారులకు మెరుగైన శిక్షణ: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
- క్రీడాభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకుంటాం
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడి
రాజమండ్రి (చైతన్య రథం): రాష్ట్రంలోని క్రీడాకారులందరికీ అత్యుత్తమ క్రీడా వసతులు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ కృషి చేస్తుందని, దానిలో భాగంగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు తీసుకుంటున్న చొరవ హర్షించదగ్గ విషయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. పట్టణంలోని ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 41వ సబ్-జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురూ తొలుత జ్యోతిప్రజ్వలన చేసి యారోను విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల క్రీడాకారులకు ప్రయోజనకరంగా రాజమహేంద్రవరంలో స్పోర్ట్స్ కాంప్లెక్సులు, మల్టీపపర్పస్ ఇండోర్ స్టేడియంలు, స్పోర్ట్స్ ఎరీనాల ఏర్పాటుకు శాప్ తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమన్నారు. శాప్ చేస్తున్న కృషికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పూర్తి సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. క్రీడావసతుల ఏర్పాటుకు కావాల్సిన వనరులను సమకూర్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
జాతీయ పోటీల నిర్వహణే ధ్యేయంగా..
జాతీయస్థాయి పోటీలు, ఖేలో ఇండియా పోటీలను సైతం రాజమహేంద్రవరంలో నిర్వహించేందుకు కావాల్సిన క్రీడాసదుపాయాలను కల్పించటానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా వసతుల కల్పన, అంతర్జాయతీ స్థాయి క్రీడాకారులను తయారుచేయాలనే లక్ష్యంతో శాప్ ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో నత్తనడకన సాగుతున్న క్రీడాభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని, 2025 మార్చినాటికి పనులన్నింటినీ పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
నన్నయ్య యూనివర్సిటీలోని మల్టీపర్పస్ ఇండోర్ హాలు, స్విమ్మింగ్ పూల్, రాజమండ్రిలోని స్టేడియం రోడ్డులో ఉన్న క్రీడావికాస కేంద్రం, త్యాగరాజ్ నగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్సు నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యేల సాయంతో త్వరలోనే పూర్తిచేసి వాడుకలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించాలని, వారికి ప్రావీణ్యమున్న క్రీడలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా, క్రీడాకారుల భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవినాయుడు వెల్లడిరచారు. కార్యక్రమంలో డీఎస్డీడీఓ శేషగిరిరావు, ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ రవి, టీడీపీ నాయకులు సురేంద్రనాథ్ చౌదరి, విజయ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.