- రాష్ట్రమంతటా అభివృద్ధి వెలుగులు..కనిపించని కబోధులు
- స్వయంప్రకటిత మేధావుల పేరిట రోత పత్రికలో చెత్త కథనాలు
- ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు
- రుణం ఇవ్వొందంటూ ప్రపంచ బ్యాంకుకు తప్పుడు ఫిర్యాదులు
- పాతాళానికి పడిపోయినా తీరు మారని వైసీపీ కాలకేయులు
- ఆ పార్టీ డీఎన్‌ఎలోనే ఫేక్ రాజకీయం, విష ప్రచారం
అమరావతి (చైతన్యరథం): అమరావతిపై అణువణువునా ద్వేషంతో నిండిన కాలకేయుల పార్టీ వైసీపీ మరోసారి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మేధావులుగా చెప్పుకునే పొరుగురాష్ట్రం వారిని, మన రాష్ట్రంలోని మాజీ ఐఏఎస్ అధికారులతో అవాకులు, చెవాకులు మాట్లాడిరచి, రోత పత్రిక సాక్షిలో కథనాలు ప్రచురిస్తోంది. మరోపక్క రుణం ఇచ్చేందుకు సిద్ధపడ్డ ప్రపంచ బ్యాంకుకు సైతం కుట్రపూరితంగా ఫిర్యాదులు పంపిస్తోంది. ఫేక్ రాజకీయం, తప్పుడు ప్రచారం డీఎన్‌ఏలోనే ఉన్న వైసీపీ.. ఇటు అమరావతి పై విషం చిమ్ముతూ…..అటు ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచేందుకు మరోసారి నీచ ప్రచారానికి తెరలేపింది. దీని కోసం పేటీఎం బ్యాచ్‌తో పాటు….మేధావుల ముసుగులో ఉన్న ఇతర రాష్ట్రాల వారినీ రంగంలోకి దింపింది. వాస్తవంగా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుంది.. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యం. నాడు – నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేసింది. చేస్తోంది. నాడు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకువచ్చి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వెనకబడ్డ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను ఏర్పాటు చేయించి ఆ ప్రాంత రూపురేఖలు మార్చేసింది. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అభివృద్ధి వికేంద్రీకరణ వైపే అడుగులు వేస్తోంది.
అర్ధంతరంగా ఆపేసి, పైశాచికానందం
గతంలో అమరావతి నిర్మాణం అడ్డుకునేందుకు వైసీపీ కాలకేయులు ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. రుణం ఇవ్వొందంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు లేఖలు రాయించారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా వీలున్న ప్రతిచోటా పనికిమాలిన పిటిషన్లు వేయించి, వీలయినంత జాప్యం జరిగేలా చేశారు. ఈ అడ్డంకులన్నీ ఛేదించుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు…రాజధాని నిర్మాణాన్ని కీలకదశకు తీసుకెళ్లిన తరుణంలో ఒక్క ఛాన్స్ మాయలో పడిన ప్రజలు కుట్రదారులకే అధికారం అప్పజెప్పారు. ఎన్నికల ముందు.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతే రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మించిన జగన్ రెడ్డి సీఎం పదవి దక్కగానే తన వికృత రూపం బయటపెట్టాడు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడాడు. లక్ష కోట్లు అమరావతి కోసం ఖర్చు పెడితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల మాటేమిటి అంటూ.. మూడు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ.. ఏ ప్రాంతంలోనూ కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండానే ఐదేళ్ల కాలం గడిపేశాడు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్న హితోక్తులను పెడచెవిన పెట్టి.. రాజధాని నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపేసి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందాడు. అమరావతి శ్మశానం, భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని, ముంపు ప్రాంతం.. ఇక్కడ లక్ష కోట్లు ఖర్చు చేసి ప్రజల సొమ్ము వృథా చేయాలా.. అంటూ జగన్ క్యాబినెట్‌లోని మంత్రులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.
నిద్రలేచిన కాలకేయులు
చేసిన తప్పు తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకునే పరిస్థితి రాగానే వైసీపీ కాలకేయులు ఒళ్లు విరుచుకుని నిద్రలేచారు. మళ్లీ అవే పాత కుట్రలను నమ్ముకుని మరోసారి అసత్య ప్రచారానికి దిగారు. అమరావతికి రుణం ఇవ్వవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు తాజాగా లేఖలు రాస్తున్నారు. ఈ `మెయిల్స్ పంపుతున్నారు. ఎవరికీ తెలియని హక్కుల సంఘాలు, ఉద్యమసంఘాలు, రైతుల సంఘాల పేరిట ఈ లేఖలు పోతున్నాయి. ఎక్కడి నుంచి పోతున్నాయో.. ఎవరు చేయిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు స్వయంగా అమరావతికి వచ్చి అందరితో మాట్లాడి, సందేహాలు నివృత్తి చేసుకున్న తరువాతనే రుణం మంజూరుకు అంగీకరించారు. ఈ విషయాన్ని మరిచిపోయి.. పాత పద్ధతిలోనే ఆకాశ రామన్న ఫిర్యాదులతో రుణాన్ని ఆపేయించేందుకు కాలకేయుల ముఠా విఫల యత్నాలు ప్రారంభించింది. గతంలో అమరావతికి రుణం ఆలస్యం కావడానికి కారణం ఈ కుట్రదారులే. ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ప్రపంచబ్యాంక్ బృందం వచ్చి విచారణ జరిపింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తమ వద్ద బలవంతంగా భూమి తీసుకున్నారని కానీ.. మరో ఫిర్యాదు కానీ చేయలేదు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సిద్దపడిన సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రుణం వద్దనుకుంది. అమరావతినే ఆపేస్తాం కాబట్టి ఆ రుణం అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు మళ్లీ రుణం మంజూరు అయింది. సంతకాలు కూడా అయిపోయాయి. అయినా అవే ప్రయత్నాలు చేస్తున్నారంటే వీళ్లని ఏమని పిలవాలో కూడా అర్థం కావటం లేదు.
కళ్లుండీ చూడలేని కబోధులు
రుణం విడుదలను ఆపటం సాధ్యం కాకపోవటంతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలకు వైసీపీ తెరలేపింది. వేల కోట్ల రూపాయలు అమరావతిపై ఖర్చు చేస్తే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటంటూ.. మేధావుల ముసుగులోని ఆంధ్రా ద్వేషులను, కళ్లుండీ చూడలేని కొందరు మాజీ ఐఏఎస్ అధికారులతో ఇంటర్వ్యూల పేరిట నీలి మీడియాలో కథనాలు వండి వారుస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో మూడు ప్రాంతాల్లోనూ జరిగిన విధ్వంసం మేధావులుగా చెప్పుకునే వీళ్ల కళ్లకు కనపడలేదా అని సామాన్య జనం సైతం ప్రశ్నిస్తున్నా.. స్వయం ప్రకటిత మేధావులు మాత్రం తమకు అప్పజెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే యథాప్రకారం అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం చేస్తారా అంటూ అమరావతిపై విషం చిమ్ముతున్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ
వాస్తవానికి సీఎం చంద్రబాబు నాయుబు రాజధాని మాత్రమే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరింపజేస్తున్నారు. టీసీఎస్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలను వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రూ.5 వేల కోట్లతో కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని డ్రోన్ హబ్‌గా మార్చేందుకు కర్నూలు కేంద్రంగా 300 ఎకరాల్లో డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తోంది. కొత్త కంపెనీలను శ్రీ సిటీకి తీసుకువస్తోంది. ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా….వీటిలో ఎక్కువ భాగం ఉత్తరాంధ్రకు, రాయలసీమకు కేటాయించింది. అయితే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకునే దుష్టరాజకీయమే తమ పార్టీ సిద్ధాంతంగా భావించే వైసీపీ ఇప్పుడు కూడా అదే దారిని ఎంచుకుంది.
ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు
చంద్రబాబు ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పలు పెట్టుబడులను తీసుకువస్తోంది. విశాఖ నగరాన్ని రాష్ట్ర అర్థిక రాజధానిగా ప్రకటించి ఆ మేరకు కీలక సంస్థలను రప్పిస్తోంది. దిగ్గజ ఐటీ సంస్థలు టీసీఎస్, గూగుల్ సహా పలు డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. విశాఖ రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ చేసి పనులు ప్రారంభించింది. జగన్ ప్రభుత్వం తరిమేసిన లులూ మాల్‌ను తిరిగి విశాఖలోనే ఏర్పాటు చేయిస్తోంది. అదే విధంగా విశాఖలో భారీ పెట్టుబడితో యూనిటీ మాల్‌ను ఏర్పాటు చేయిస్తోంది. అనకాపల్లి జిల్లాలో లక్షా 40 వేల రూపాయల పెట్టుబడితో ఆర్సెల్లార్, మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కానుంది. విశాఖ మెడ్‌టెక్ జోన్‌కు మళ్లీ ఊపిరి పోసింది. ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భాగస్వామ్యంతో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు సమూలంగా మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రానికే కాకుండా, దేశానికే తలమానికంగా విరాజిల్లేలా విశాఖ నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా సీమ
రాయలసీమ విషయానికి వస్తే.. కర్నూలు న్యాయరాజధాని అంటూ సీమ ప్రజలను, ముఖ్యంగా కర్నూలు ప్రజలను జగన్ మోసం చేశాడు. కానీ సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచీ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. త్వరలో ఏర్పాటు కాబోతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కర్నూలు జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలను రప్పించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఓర్వకల్లులో దేశంలో తొలి ‘డ్రోన్ హబ్’ ఏర్పాటుకి చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఓర్వకల్లులోనే దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. భారత్, జపాన్ దేశాలకు చెందిన రెండు కంపెనీలు కలిసి ఓర్వకల్లులో రూ. 14,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి. దీనికి సంబందించి ఒప్పంద పత్రాలపై సంక్రాంతి పండుగ తర్వాత సంతకాలు చేయబోతున్నారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలోనే నాచ్ కార్పొరేషన్ అనే సంస్థ రూ.1,035 కోట్ల పెట్టుబడితో డక్ట్ ఐరన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో కూడా సుమారు వెయ్యి మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు-నెల్లూరు జిల్లాల మద్య శ్రీ సిటీలో విన్‌ఫాస్ట్, వెర్మీరెన్, ఎల్జీ, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెట్, భారత్ ఫోర్జ్ సహా అనేక పరిశ్రమలు వచ్చాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి. నెల్లూరులో బీపీసీఎల్ రిఫైనరీ, రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ రానున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో రెండు భారీ గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, కడప జిల్లాలో కూడా పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో రాబోయే 5 ఏళ్ళలో సీమ జిల్లాల రూపురేఖలు మారిపోవటం ఖాయం.
ఇవన్నీ కనిపించకుండా పెయిడ్ ఆర్టిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో. ఏదేమైనా సొంత రాష్ట్రం మీద కుట్రలు చేసుకునే వాళ్లు ఉండటం.. సొంత రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఆపేయాలని కుట్రలు పన్నే వాళ్లు ఉండటం ఆంధ్రుల దౌర్భగ్యమే. కానీ ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రజాభిప్రాయాన్ని కూడా గుర్తించకుండా ఇలాంటి పనులు చేసి పాతాళానికి పడిపోయారు. చివరికి పూర్తిగా భూస్థాపితం అయ్యేవరకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు.