- సిబ్బంది, పోలీసులు ఉండీ ఘటన దురదృష్టకరం
- ఈవో, ఏఈవో, పోలీసులు బాధ్యత తీసుకోవాలి
- టీటీడీ సభ్యులు మృతుల ఇళ్లకు వెళ్లి క్షమాపణ కోరాలి
- పోలీసు అధికారుల్లో కొందరు కావాలనే చేశారా?
- ఇంతమంది పోలీసులున్నా తప్పు ఎందుకు జరిగింది?
- ఈవో, అదనపు ఈవో, పాలకమండలికి గ్యాప్ ఉందా?
- అనుమానాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది
- పోలీసు శాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి తీసుకెళతా
- వేచి ఉండే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలి
- మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
- ఘటనా స్థలం పరిశీలన..క్షతగాత్రులకు పరామర్శ
తిరుపతి(చైతన్యరథం): వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుప తిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు జరిగింది..బాధ్యత తీసుకుంటాం. క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వరస్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతిఒక్కరినీ క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీఐపీ లపై కాదు..సామాన్యులపైనా టీటీడీ దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమా పణలు చెప్పాలి. తొక్కిసలాట ఘటనకు ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలి. ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి.
అధికా రులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం. తొక్కిసలాట జరిగితే సహాయక చర్య లు ఎలా ఉండాలనే ప్రణాళిక లేదు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. పోలీసు ల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమా నాలన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఈవో, అదనపు ఈవో, పాలకమండలికి మధ్య గ్యాప్ ఉందనే వాదన ఉంది. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది? పోలీసుశాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి మళ్లీ తీసుకెళతా. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8- 9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలి. సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని కోరారు.