తిరుపతి (చైతన్య రథం): తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. ‘‘తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాలపాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు’’ అని నివేదికలో వెల్లడిరచారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్) టోకెన్ల జారీకి తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున కేంద్రాల వద్దకు రాగా.. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
తిరుమల వైకుంఠద్వార దర్శనం
తొలి మూడు రోజులకు టోకెన్ల జారీ
తిరుపతి (చైతన్య రథం): వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి తితిదే టోకెన్ల జారీని పూర్తి చేసింది. తొలి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఈ కోటాను పూర్తి చేసింది. వైకుంఠద్వార దర్శనం కోసం రోజుకు 40వేల టోకెన్ల చొప్పున జారీ చేశారు. వీటిని కలిగిన భక్తులను మాత్రమే 10, 11, 12 తేదీల్లో అనుమతించనున్నారు. 13నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఏరోజుకారోజు ఇవ్వనున్నారు.