- గుంటూరు ఏ1 కన్వేన్షన్‌లో రాష్ట్రస్థాయి వేడుకలు
- అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహణ
- బీసీ సంక్షేమం, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత
- బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్ సవిత వెల్లడి
అమరావతి (చైతన్య రథం): ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను 11న రాష్ట్రస్థాయిలోనూ మరియు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బీసీల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తూ విశ్మకర్మ, వాల్మీకి మరియు కనకదాస జయంతులను ఘనంగా నిర్వహించారన్నారు. అలాగే మరో బీసీ ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను 11న గుంటూరు ఏ1 కన్వెన్షన్ హాలులో, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర్వులను జారీ చేశారన్నారు.
కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో ఓబన్న జన్మించారని, శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు మరియు రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయన్నారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటం ఇందులో ముఖ్యమైందన్నారు. ఈ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగావున్న వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారని, వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని 10 వేలమందితో ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన మహోన్నత వ్యక్తి వడ్డే ఓబన్న అని అన్నారు. బ్రిటీష్ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేఖంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జయంతి నిర్వహణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీసీల సంక్షేమానికి, అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత
బీసీల సంక్షేమానికి, అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి స్వర్గీయ ఎన్టీఆర్‌తోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా బీసీలకు బడ్జెట్లో రూ.39,007 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 60 వేలమందికి లబ్దిచేకూర్చేలా ఈడబ్ల్యుఎస్ కార్పొరేషన్లకు రూ.10,273.80 కోట్లు కేటాయించామన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. కాస్మోటిక్ ఛార్జీలకు బడ్జెట్‌లో రూ.11 కోట్లు కేటాయించగా, అదనంగా మరో రూ.21.60 కోట్లు మంజూరు చేశామన్నారు.
ట్యూటర్ల పారితోషకానికి బడ్జెట్‌లో కోటి కేటాయించగా, ఇప్పుడు రూ.3.20 కోట్లు అదనంగా చెల్లిస్తున్నామన్నారు. గతంలో నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన 5 బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.85 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించబోతున్నామని, బీసీ అభ్యర్థుల కోసం ఇటీవల విజయవాడలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఈ సెంటర్‌లో 110మంది అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన సివిల్స్ శిక్షణ అందిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ ద్వారా 6 వేలమందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో ఆన్‌లైన్ శిక్షణా తరగతులు కూడా ప్రారంభించబోతున్నామన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.31.51 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.222.97 కోట్లు కేటాయించామన్నారు.
ఇటీవల 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటుచేశామని, ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచడంతోపాటు విషయ పరిజ్ఞానం పెంపుదలకు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకుల బోధనలు, కంటెంటును అందజేస్తున్నామన్నారు. 2014-19 మధ్య ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.45.54 కోట్ల బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న మూడు బీసీ భవనాలను పూర్తిచేయడానికి రూ.10.12 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.18 కోట్లతో వసతి గృహాల్లో వంట సామాగ్రి, ఇతర వస్తువుల కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే హాస్టళ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రూ.13.10 కోట్లతో వసతి గృహాల మరమ్మతులు చేపట్టామన్నారు. బీసీ యువతను, మహిళలను ఎంఎస్‌ఎంఈ ద్వారా పారిశ్రామికవేత్తలుగా రూపొదించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నామన్నారు.
దీనిలో భాగంగా 1700 జనరిక్ మెడికల్ షాపులు బీసీ బిడ్డలతో ప్రారంభించబోతున్నామన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు భవనాలను పూర్తిచేయడానికి రూ.5.41 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో ఉన్న బీపీఎల్ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కో`ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటుచేసి వ్యక్తిగత, గ్రూపు రుణాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఏపీ ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ కోపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు.