- తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరం
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల (చైతన్యరథం): వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భక్తులందరికీ టీటీడీ పాలకమండలి తరఫున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడిరచారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందడం, పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుఎంతో బాధపడ్డారని తెలిపారు. కొన్ని పొరపాట్లు జరిగాయని మా దృష్టికి వచ్చింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల తప్పిదం వల్లే జరిగింది.
ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు న్యాయవిచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులు సిద్ధం చేశాం. శనివారం ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. ఘటనలో మా తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అన్నీ అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. తప్పిదం ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది అనేది విచారణలో తేలుతుంది. విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరతాం. ఆ తర్వాతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.