- ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతరంగా విభజించండి
- ఇక జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు
- గ్రీవెన్సులు తగ్గితే.. పాలన బాగున్నట్టు
- ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఉద్బోధించారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దిశానిర్దేశం చేస్తూ.. ఫిర్యాదులపై కలెక్టర్లు వేగంగా స్పందించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తూ.. ‘‘జీరో టాలరెన్సు విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే. గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్టే. విభాగాల వారీగా గ్రీవెన్సులపై విశ్లేషణ చేస్తాం. మురుగు కాల్వలను శుభ్రపరచేందుకు కార్యాచరణ చేపట్టాలి. ముడు నెలల్లోగా నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రపర్చాలి. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడున్నా.. తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలి. నీటి భద్రత గురించి మాట్లాడుతుంటే తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండకూడదు.
వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్సులు ఉండేలా చర్యలు చేపట్టాలి’’ అని ఆదేశించారు. అలాగే, భోజన విరామానంతరం సాగిన సదస్సులో సీఎం చంద్రబాబు శాఖలు, జిల్లాలవారీగా కలెక్టర్ల పనితీరును సమీక్షించారు. వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసిన సీఎం, నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవలి కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని గుర్తు చేస్తూనే.. ఉగాదినాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. తిరుపతిలాంటి నగరాల్లో ఈ సమస్య ఉంది. లబ్దిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అలాగే, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ.. ‘‘వాట్సాప్ గవర్నెన్సు సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. డిజి వెరిఫై -ఏపీ ద్వారా ధృవపత్రాలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీకి కూడా లింక్ చేశాం. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించండి. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగం రోజువారీ విధులకు హాజరు కావాల్సిందే… నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. 4జీ టవర్లు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టు మార్చినాటికి పూర్తి కావాలి. బీఎస్‌ఎన్‌ఎల్, జియో టవర్లను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లు సహకరించాలి. మారుమూల గ్రామాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి కావాలి. ఉద్యోగుల సామర్ధ్యం పెంచేందుకు ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నాం. ఇప్పటికే 4 లక్షలమందికి పైగా ఉద్యోగులకు సామర్ధ్యం పెంపుదల కోసం కోర్సులను నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్‌లో ఉద్యోగులకు మరిన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు.














