- వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన
- ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ ప్రకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు
గొల్లప్రోలు (చైతన్యరథం): పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని | గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూ.3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. 2024 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది. పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు పవన్ కళ్యాణికి చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. శుక్రవారం సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రికి కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.

















